పటమట(విజయవాడతూర్పు): అక్రమ లే అవుట్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పట్టణ ప్రణాళిక విభాగం ఉద్యోగులు ఇద్దని సస్పెండ్ చేస్తూ నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలోని సర్వే నంబర్ 37, 78ఏ/ఏలోని 3.5 ఎకరాల స్థలంలో అక్రమ లే అవుట్ వ్యవహారంలో వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు అవినీతికి పాల్పడ్డారు. దీనిపై ఈ నెల తొమ్మిదో తేదీన ‘ఆయన చెబితే అంతా సక్రమమే’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ కథ నంపై స్పందించిన పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఏసీపీ – 2గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వై.రాంబాబు, స్థానిక టీపీఓ షేక్ రిజ్వానాను బాధ్యులుగా గుర్తించి వారిని సస్పెండ్ చేస్తూ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఏసీపీపై మరో ఆరోపణ
ఇటీవల ఏలూరు కాలువ గట్టుపై లెనిన్ సెంటర్ లోని పలు దుకాణాలకు విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని విద్యుత్ శాఖ డీఈకి నగరపాలక సంస్థ కమిషనర్ అప్రూవల్ లేకుండా వీఎంసీ సర్కిల్–2 ఏసీపీ వై.రాంబాబు లేఖ రాశారు. ఈ వ్యవహారం తెలుసుకున్న కమిషనర్ ధ్యానచంద్ర అతడిపై చర్యలు తీసుకోవాలని డీటీసీపీని ఆదేశించారు. ఏసీపీ రాంబా బును ఈ ఆరోపణలో కూడా సస్పెండ్ చేస్తున్నట్లు డైరెక్టర్ విద్యుల్లత తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
విస్సన్నపేట: స్థానిక ఎ.కొండూరు రోడ్డులో మంగళవారం రాత్రి ద్విచక్రవాహనం, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. స్థానికుల కథనం మేరకు.. చాట్రాయి మండలం తుమ్మగూడేనికి చెందిన ట్రాక్టర్ విస్సన్నపేట నుంచి ఎ.కొండూరు రోడ్డువైపు వెళ్తోంది. రెడ్డి గూడెం మండలం కూనపురాజుపర్వ గ్రామానికి చెందిన చన్నమల్ల కిషోర్ (48) ద్విచక్రవాహనంపై విస్సన్నపేట బయలుదేరాడు. ఎ.కొండూరు రోడ్డులో ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కిషోర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని టౌన్ మూవింగ్ పార్టీ కానిస్టేబుళ్లు నాగేశ్వరరావు, చెన్నకేశవులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడని ఉమెన్ హెడ్‌కానిస్టేబుల్ అలివేలు మంగ బుధవారం తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.


