విస్సన్నపేట: మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన వివాహిత సాలి స్రవంతి (22) గ్యాస్ పొయ్యి వద్ద నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు కంభం సుజాత, ఏసుపాదం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కథనం మేరకు.. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కల్యాణంపాడు గ్రామానికి చెందిన కంభం ఏసుపాదం, సుజాత దంప తుల కుమార్తె స్రవంతికి విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన సాలి వెంకట్రావు కుమారుడు జగదీష్‌తో 2024లో వివాహమైంది. స్రవంతి, జగదీష్‌కు ఏడాది వయసు కుమారుడు ఉన్నాడు. వివాహమయిన తర్వాత జగదీష్ కొంత కాలం భార్యతో బాగానే ఉన్నప్పటికీ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళతో జగదీష్ మాట్లాడటాన్ని గుర్తించి అతడిని నిలదీసింది, ఆ తరువాత విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. అప్పటి నుంచి జగదీష్ భార్యను కొట్టడం, తిట్టడం ప్రారంభించాడు. మంగళవారం రాత్రి సమయంలో గ్యాస్ పొయ్యిపై స్రవంతి పాలు కాస్తుండగా, ‘నీతో కాపురం చేయటం నాకు ఇష్టం లేదు. నీవు చస్తే పీడ విరగడవుతుంది’ అంటూ జగదీష్ తిట్టడంతో మనస్తాపానికి గురైన స్రవంతి గ్యాస్‌పొయ్యి వద్ద వంటికి నిప్పటించుకుని తీవ్రంగా గాయపడింది. ఇరుగు, పొరుగు వారు గుర్తించి 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది వచ్చి స్రవంతిని తొలుత విస్సన్నపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి స్రవంతి మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.అర్జునరాజు తెలిపారు.


