2024లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతోంది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లను ప్రోత్సహించే చర్యలు చేపట్టారు. తొలుత రేషనలైజేషన్ పేరిట గ్రామీణ ప్రాంతాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. చాలా బడులకు ఏకోపాధ్యాయుడిని కేటాయించారు. ఏదైనా కారణంతో ఉపాధ్యాయుడు సెలవు పెడితే ఏకోపాధ్యాయ పాఠశాలకు ఆ రోజు సెలవు ఇచ్చినట్టే. ఈ విషయంపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో ఎంఈఓలను వివరణ కోరితే.. ఏకోపాధ్యాయ స్కూళ్లలో టీచర్ సెలవు పెడితే సీఆర్పీ లేదా వేరే స్కూల్ నుంచి టీచర్‌ను సర్దుబాటు చేస్తున్నామని చెప్పారు. అదే రోజు వారు కూడా సెలవు పెడితే పరిస్థితి ఏమిటంటే మౌనమే సమాధానం అయ్యింది. పేద విద్యార్థులకు సర్కారు విద్య దూరం చేస్తున్న సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రుల, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


