ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు బుధవారం విరాళాలను అందజేశారు. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రణీత్‌కుమార్, పవిత్ర కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి తమ కుమారుడు చిన్నారి జి.దేవాశిష్ పేరిట రూ. 1,01,116, అలాగే పవిత్ర తల్లి ఈశ్వరి, సోదరుడు నిఖిల్ చిన్నారి జి.ధీరన్ సాయి పేరిట రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్ బాచు పల్లికి చెందిన జీఎన్ భాస్కరరావు దంపతులు, విజయవాడ వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన ఎం. జైరామ్ కుటుంబం అన్నదానానికి రూ. లక్ష చొప్పున విరాళాన్ని అందజేసింది. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ పర్యవేక్షకుడు డీవీవీ సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి బుధవారం పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలం, లింగారావుపాలెం గ్రామానికి చెందిన ఆలోకం వేణుకుమార్, త్రివేణి దంపతులు రూ.1,01,116, భక్తుల సౌకర్యార్థం రూ.32 వేలు విలువ కలిగిన రెండు వాటర్ కూలర్లను ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. ఈసందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ లక్ష్మణ్, ఇన్‌స్పెక్టర్ బద్దుల కృష్ణమోహన్ పాల్గొన్నారు.
మధురానగర్(విజయవాడసెంట్రల్): జగ్గయ్యపేట మునిసిపాలిటీ, డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ డి. యుగంధర్ మూడు స్వర్ణం, ఒక రజత పతకం సాధించారు. ఈ సందర్భంగా బుధవారం కళాశాలలో యుగంధర్ అభినందన కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 56–60 సంవత్సరాల విభాగంలో తమ కళాశాల అధ్యాపకుడు మూడు స్వర్ణపతకాలు, ఒక రజతం సాధించటం కళాశాలకే గర్వకారణంగా పేర్కొన్నారు. ఆయన 200మీటర్ల ఫ్రీ స్టైల్, 25 మీటర్ల బటర్‌ఫ్లై, 100మీటర్ల ఇండివిడ్యువల్ మెడ్లీ విభాగాలలో స్వర్ణ పతకాలు, అలాగే మరొక విభాగంలో రజత పతకం సాధించినట్లు వివరించారు. అనంతరం యుగంధర్‌ను కళాశాల అధ్యాపకులు డాక్టర్ వీఎస్‌డీఎస్ బాలసుబ్రహ్మణ్యం, జె. నాగేశ్వరరావు, విజయదీప్ తదితరులతో కలిసి అభినందించారు.


