మధురానగర్(విజయవాడసెంట్రల్): జనవరి 2017 నుంచి పెన్షన్ సవరణను తక్షణమే అమలు చేయాలని ఆల్ ఇండియా రిటైర్డ్ బీఎస్ ఎన్‌ఎల్ ఎగ్జిక్యూటివ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి.కేశవరావు, ఎ.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కేంద్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం టెలికాం శాఖలో పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా రిటైర్డ్ బీఎస్‌ఎన్‌ఎల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ ఆధ్వర్యాన సీసీఏ (కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్) కార్యాలయం వద్ద నిరసన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా కేశవరావు, కోటేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీరువల్ల బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందో ళన వ్యక్తంచేశారు. టెలికాం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తాము దశలవారీ పోరాటం చేస్తున్నామని తెలిపారు. 2026 జనవరి నుంచి రావాల్సిన ఐడీఏ, డీఆర్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 1996 తర్వాత నియమితులైన జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ల వేతనాన్ని నిర్ధారించాలని కోరారు. మండే ఎండల్లో విశ్రాంత ఉద్యోగులు పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బి.శివరామ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యేశ్వర రావు, సర్కిల్ ఆర్థిక కార్యదర్శి ఎం.చంద్ర శేఖజురావు, సంఘం సభ్యులు పలువురు పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ఇందిరాగాంధి మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియాన్ని రూ.170 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని క్రీడలు, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. స్టేడియంలో చేపట్టనున్న వివిధ పనులకు బుధవారం భూమి పూజ జరిగింది. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి ఈ కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియాన్ని రూ.170 కోట్లతో మూడు దశల్లో అభివృద్ధి చేస్తామన్నారు. మొదటి దశలో రూ.60 కోట్లతో పనులు చేపట్టనున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఖేలో ఇండియాలో భాగంగా రూ.20 కోట్లు, శాప్, విజయవాడ నగర పాలక సంస్థ సంయుక్తంగా మరో రూ.40 కోట్లతో ఈ పనులు చేస్తున్నామని వివరించారు. శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది లోపుగా ఈ స్టేడియాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. శాప్‌తో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కలిసి పనిచేయడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. అమరావతిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. నగరంలోని క్రీడాకారులతో పాటుగా క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): తాళం వేసిన ఇంట్లోని బీరువాలో బంగారు నగలు, వెండి వస్తువులు చోరీకి గురైన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణలంక, శంకరమఠం వీధిలోని ఓ భవనం మొదటి అంతస్తులో రెంటచింతల వెంకటాచలయాజులు కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. పౌరోహిత్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గత నెల 20వ తేదీన ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి అయోధ్య వెళ్లారు. తిరిగి ఈ నెల ఏడో తేదీ రాత్రి 9.30 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళం పగలగొట్టి తలుపు దగ్గరగా వేసి ఉండడాన్ని గమనించి కంగారుగా లోనికి వెళ్లి చూడగా బీరువా కూడా తెరిచి కనిపించింది. బీరువాలో వస్తువులు అన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి. అందులో దాచిన పది కాసుల బంగారు నగలు, 30 కిలోల వెండి వస్తువులు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏడీసీపీ రాజారావు, కృష్ణలంక సీఐ నాగరాజు పోలీసు సిబ్బందితో బుధవారం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పరిసరాల్లోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. క్లూస్ టీం ఇంట్లోని వేలిముద్రలతో పాటు పలు ఆధారాలను సేకరించింది. ఈ చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


