నిషేధిత భూములకు విముక్తి కల్పించాలి 10న కోడూరు ప్రధాన సెంటర్‌లో ర్యాలీ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు
కోడూరు: భూములపై రైతులు తమ హక్కులు కోల్పోయేలా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 22ఏ నిషేధిత జాబితా జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పోరుబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు తెలిపారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద రమేష్‌బాబు మండల నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులు సాగు చేస్తున్న పంట భూములను 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చి భూములు రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు జరగకుండా ప్రత్యేక జీఓ తీసుకొచ్చా రని రమేష్‌బాబు గుర్తుచేశారు. ఈ జీఓ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల ఎకరాల భూమి నిషేధిత జాబితాలోకి చేరిందన్నారు. దివిసీమలోనే 17,856 ఎకరాల భూమిని 22ఏ కింద చేర్చి 10,116 మంది రైతులకు తీవ్ర నష్టం కలిగించారని వివరించారు. ఈ భూములకు విముక్తి కల్పించాలంటూ నాడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
రైతులకు అండగా నిలిచిన జగన్‌మోహన్‌రెడ్డి
టీడీపీ ప్రభుత్వం భూములను నిషేధిత జాబితా లోకి చేర్చుతూ ఇచ్చిన జీఓను వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రద్దు చేసినట్లు రమేష్‌బాబు తెలిపారు. అవనిగడ్డ కేంద్రంగానే భారీ బహిరంగ సభ నిర్వహించి నిషేధిత జాబితాను నుంచి భూములను తొలగించి, భూములకు సర్వ హక్కులను రైతులకు కల్పిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి పట్టాలు కూడా పంపిణీ చేశారన్నారు. చంద్రబాబు మాత్రం వైఎస్సార్ సీపీపై బురద జల్లే ప్రయత్నం చేశారని రమేష్‌బాబు మండిపడ్డారు. 2024లోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన జీఓను రద్దు చేసి 40 వేల ఎకరాల భూమిని నిషేధిత జాబితాలోకి చంద్రబాబు చేర్చి మళ్లీ రైతులు భూములపై హక్కు కోల్పోయేలా చేశారని విమర్శించారు. ప్రస్తుతం నిషేధిత భూముల జాబితాను ఒకేసారి రద్దు చేయకుండా ఒకొక్క రైతుకు సంబంధించిన భూముల వివరాలను పరిశీలించి, వాటి ఆధారంగా జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని రమేష్‌బాబు మండిపడ్డారు. ఒకొక్క రైతు వివరాలు సేకరించే సమ యంలో అన్నదాతలు తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు రూ.కోట్లతో లంచాలు ముట్టచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోఒదని మండిపడ్డారు.
కోడూరులో నిరసన కార్యక్రమం..
నిషేధిత భూముల జాబితా సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పదో తేదీన కోడూరులో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిహాద్రి రమేష్‌బాబు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ కార్యా లయం నుంచి ప్రధాన సెంటర్ మీదగా తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, అధికారులకు వినతిపత్రాలు అందిస్తామన్నారు. రైతులందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలపాలని కోరారు. పార్టీ రైతు విభాగం జిల్లా కార్యదర్శి కొండవీటి వీరవెంకటనారాయణరావు, ఎంపీటీసీ సభ్యుడు బడే గంగాధరరావు, ఎస్సీసెల్ కన్వీనర్ వెన్నా ప్రసాద్, నేతలు తిమ్మన శివ, మాలే నరేష్, బండే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


