వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

Apr 9 2026 8:35 AM | Updated on Apr 9 2026 8:35 AM

గన్నవరం: ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. మండల కేంద్రమైన గన్నవరం వద్ద చెన్నయ్‌ – కోల్‌కతా జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ఘటనలో ఏపీపీ మృతిచెందగా, మరొకరు తీవ్రగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. విజయవాడలోని కృష్ణలంకకు చెందిన దోనేపూడి సాంబశివరావు గన్నవరం కోర్టులో ఏపీపీగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోహిత్‌కుమార్‌ అనే వ్యక్తితో కలిసి ఆయన ద్విచక్ర వాహనంపై హనుమాన్‌జంక్షన్‌ వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. స్థానిక ఆల్ఫా హోటల్‌ వద్దకు రాగనే ద్విచక్ర వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న మురుగు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాంబశివరావు, లోహిత్‌కుమార్‌ను సమీపంలోని పిన్నమనేని సిద్ధార్ధ ఆస్పత్రికి తరలించారు. అయితే సాంబశివరావు అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి

గంపలగూడెం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. గంపలగూడెం పోలీసుల కథనం మేరకు.. తిరువూరు ఆర్టీసి డిపోకు చెందిన బస్సు మధిరకు బయలుదేరింది అదే సమయంలో మండలంలోని మాటూరుపేటకు చెందిన సేలం శివశంకర్‌రెడ్డి (30) వరిగడ్డి కట్టలు కట్టేయంత్రాన్ని ట్రాక్టర్‌కు కట్టుకుని మధిర వైపు ప్రయాణిస్తున్నాడు. రాజవరం శివారు మలుపు వద్ద బస్సు, ట్రాక్టర్‌ ఒకదానికొకటి తగిలాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ అదుపతప్పి పల్టీకొట్టింది. ట్రాక్టర్‌ నడుపుతున్న శివశంకర్‌రెడ్డి ప్రమాదం ధాటికి విసురుగా వెళ్లి బస్సుకు తగిలాడు. దీంతో తీవ్రంగా గాయపడిన శివశంకరరెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. అతనికి భార్య శివాని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌ తెలిపారు.

కారు ఢీకొని వృద్ధురాలి మృతి

జూపూడి(ఇబ్రహీంపట్నం): కారు ఢీకొని రోడ్డు దాటుతున్న వృద్ధురాలు మృతిచెందిన ఘటన 65వ నంబర్‌ జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన పాలపు పుల్లమ్మ(60) వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక నిమ్రా వైద్యశాలకు వచ్చింది. చికిత్స అనంతరం తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారి దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పుల్లమ్మ మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న ఎస్‌ఐ బి.రాజు ఘటనా స్థలానికి చేరుకుని వివ రాలు సేకరించారు. మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గూడ్స్‌ వాహనాన్ని బైక్‌ ఢీకొని యువకుడు..

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం) గూడ్స్‌ వాహనాన్ని ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన మచిలీపట్నం–అవనిగడ్డ హైవేపై బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గూడూరు మండలం పిండివారిపాలెంనకు చెందిన దేసు రోహిత్‌ (19), పెడన మండలం దక్షిణ తెలుగురావుపాలెంనకు చెందిన చరణ్‌, బందరు మండలం హుస్సేన్‌పాలెంనకు చెందిన మరో యువకుడు స్నేహితులు. వీరు ముగ్గురు కోతమిషన్‌లో పనిచేస్తుంటారు. బుధవారం స్నేహితులు ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై అవనిగడ్డకు బయలుదేరారు. మచిలీపట్నం నుంచి అవనిగడ్డకు వెళ్లే హైవే ఫ్లై ఓవర్‌పై నుంచి నరసాపురం వైపు నుంచి విజయవాడ వెళ్తున్న గూడ్స్‌ వాహనం యూటర్న్‌ తీసుకుంటోంది. అదే సమయంలో రోహిత్‌ నడుపుతున్న బైక్‌ అదుపుతప్పి గూడ్స్‌ వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో రోహిత్‌పై నుంచి గూడ్స్‌ వాహనం వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. మిగిలిన ఇద్దరు గాయపడ్డారు. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. రూరల్‌ ఎస్‌ఐ నాగరాజు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు నమోదు చేసుకున్నారు. రోహిత్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం రోహిత్‌ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement