నాగాయలంక: మండలంలోని గుల్లలమోద ప్రధాన మార్గంలో పెదపాలెం అంబేడ్కర్ విగ్రహం సమీపంలో సోమవారం రెండు బైక్‌లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మొవ్వ మండలం కోసూరు గ్రామానికి చెందిన జన్ను రామాంజనేయులు (40) మృతి చెందాడు. నాగాయలంక ఎస్‌ఐ కలిదిండి రాజేష్ కథనం మేరకు.. రామాంజనేయులు ఏటిమొగ గ్రామం వెళ్తున్న సమయంలో ఎదురుగా ఈలచెట్లదిబ్బ గ్రామం నుంచి నాగాయలంక వైపు వస్తున్న చెన్ను నాగేశ్వరరావు, కొక్కిలిగడ్డ నాగ రాజు బైక్‌పై వస్తూ ఢీకొట్టారు. ఈ ఘటనలో రామాంజనేయులు తలకు తీవ్ర గాయాలయ్యాయి. నాగరాజు, నాగేశ్వరరావు కూడా గాయపడ్డారు. అందరినీ హుటాహుటిన 108 అంబులెన్స్ వాహ నంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామాంజనేయులును మెరుగైన చికిత్స నిమిత్తం మచిలీపట్నం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లా లని అవనిగడ్డ వైద్యులు సూచించారు. అయితే బందరు ఆసుపత్రికి వెళ్ళేసరికి రామాంజనేయులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగతా ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్‌ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


