శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లేశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని దుర్గగుడి ఈఓ శీనానాయక్ తెలిపారు. తన చాంబర్‌లో ఆలయ ఇంజినీరింగ్ అధికారులు, ఏఈఓలు, సూపరిండెంటెంట్, ఇతర ముఖ్య అధికారులతో శివరాత్రి ఏర్పాట్లపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వ హించారు. భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామిని దర్శించుకునేలా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మల్లేశ్వర ఆలయ ప్రాంగణంలో అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే దుర్గాఘాట్, వీఐపీ స్నానఘాట్లలో ఏర్పాట్లపై చర్చించారు. ఏసీ రంగారావు, ఈఈ కోటేశ్వరరావు, ఏఈఓలు సుధారాణి, చంద్రశేఖర్, గంగాధర్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ పాల్గొన్నారు.
పెనమలూరు: మండలంలోని యనమలకుదురు కొండపై వేంచేసిన శ్రీపార్వతి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని రాజమండ్రి దేవదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ త్రినాథరావు బుధవారం దర్శించుకున్నారు. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన ఆలయానికి వచ్చి ఏర్పా ట్లను పరిశీలించారు. భక్తులకు సకల వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ ఎన్‌వి.సాంబశివరావు, ఆలయ ఈఓ ఎన్.భవాని పాల్గొన్నారు. శివ రాత్రి పండుగ రోజు వీఐపీ దర్శనాలకు ప్రత్యేక సమయాలు కేటాయించా మని ఈఓ భవాని తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు వీఐపీలు స్వామిని దర్శించుకోవాలని కోరారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ ఆలయానికి బుధవారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీకి చెందిన ఎం.వెంకటేశ్వర్లు, లక్ష్మీరాజ్యం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. తమ కుటుంబ సభ్యులు కె. దీిప్తి, రాజేష్, జి.విద్య, సతీష్ సూర్యనారాయణ పేరిట నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులకు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన మెట్టపల్లి రామదేవి అన్నదానానికి రూ.1,01,116 విరాళం సమర్పించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావు, ప్రత్యేక ఆహ్వానితుడు రామబ్రహ్మం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మవారికి భక్తులు హుండీల ద్వారా రూ.78.12 లక్షలను కానుకలు, మొక్కుబడిగా సమర్పించారు. హుండీ కానుకలను బుధవారం అమ్మవారి మండపంలో లెక్కించారు. 71 రోజులకు రూ.78,12,667 నగదు, 50 గ్రాముల బంగారం, 220 గ్రాముల వెండి సమకూరాయని ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు. 12 యూఎస్‌ఏ డాలర్లు, పది సౌదీ రియాల్స్, ఒక మలేషియా రింగిట్, 20 ఆస్ట్రేలియా డాలర్లు కూడా వచ్చాయన్నారు. కానుకలను ఆలయ సిబ్బందితో పాటు పరిటాలకు చెందిన ఉమ సేవా సమితి సభ్యులు, గ్రామానికి చెందిన భక్తులు లెక్కించారు. ఆలయ ఈఓ, గ్రూపు ఆలయాల ఈఓ సురేష్, ఈఈ ఎల్.రమాదేవి, ఏఈఓ జంగం శ్రీనివాసరావు, దేవదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు.
శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష


