కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడం మానుకోండి
మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు
అవనిగడ్డ: కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని, వివాదాలు తలెత్తి నియోజకవర్గంలో ఏదైనా జరిగితే ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌దే బాధ్యతని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు హెచ్చరించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చినా, మేధావులు వారిస్తున్నా పట్టించుకోకుండా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా స్థానిక కూటమి నేతలు మాట్లాడుతున్నారని చెప్పారు. టీడీపీ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు ఇటీవల మాట్లాడుతూ తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు, బాత్‌రూంలో వాడే కెమికల్స్ కలిపారని చెప్పడం దారుణమన్నారు. చంద్రబాబు మెప్పుకోసం కారుకూతలు కూస్తున్న వ్యక్తులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఇది గుంటూరు కాదు.. దివిసీమ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదన్నారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో
అభివృద్ధి శూన్యం..
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి జరిగిందో ప్రజలందరికీ తెలుసన్నారు. రూ.108కోట్లు మంజూరు చేయించినా.. ఎదురుమొండి వారధిని ఎందుకు గాలికి వదిలేశారో చెప్పాలన్నారు. అవనిగడ్డ డంపింగ్ యార్డు మార్చలేక పోయారని, ఎడ్లంక వారధి ఊసేలేదని, బండికోళ్లంక వద్ద కృష్ణానదిపై వారధి నిర్మాణం కోసం తాను కృషి చేస్తే ఆ విషయం పట్టించుకునే తీరిక ఎమ్మెల్యేకి లేకపోవడం దారుణమన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, వైఎస్సార్ సీపీ పంచాయితీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు రేపల్లె శ్రీనివాసరావు, మహిళా విభాగం నాయకురాలు మానేపల్లి అరుణ, మండల కోఆప్షన్ సభ్యుడు షేక్‌నజీర్‌బాషా, ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి గాజుల జయగోపాల్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు చింతలపూడి బాలు తదితరులు పాల్గొన్నారు.


