సీనియార్టీ జాబితాను విడుదల చేయండి
డీఈఓ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు
మచిలీపట్నంఅర్బన్: అన్ని క్యాడర్ల సీనియార్టీ జాబితాను వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కోరారు. ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విద్యారంగ సమస్యలను జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లారు. వారు మాట్లాడుతూ స్టెప్‌అప్ సందర్భాల్లో జాబితాల లేమి కారణంగా ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పదో తరగతి ఇన్విజిలేషన్, స్పాట్ వాల్యూయేషన్ విధుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, రిటైర్మెంట్‌కు సమీపంలో ఉన్నవారు, వికలాంగులకు వెసులుబాటు కల్పించాలని కోరారు. ‘మధ్యాహ్న’ బియ్యాన్ని పాఠశాల పాయింట్ వద్ద కాకుండా ఇతర హైస్కూల్స్ వద్ద దించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. టెన్త్ విద్యార్థుల 100 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా సెలవు దినాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కాంపెన్సేటరీ లీవ్ మంజూరు చేయాలని కోరారు. అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ సుబ్బారావు ఉపాధ్యాయుల సమస్యలపై స్పందిస్తూ, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో వైఎస్‌ఆర్సీపీ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహంకాళి రావు, చంద్రశేఖరరెడ్డి, ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.డి. షౌకత్ హుస్సేన్, బి. కనకారావు సహా పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


