యూపీహెచ్‌సీలో కలెక్టర్ తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ స్పష్టంచేశారు. గిరిపురం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టీని పరిశీలించి, విధులకు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు. అనంతరం ఓపీ సేవల నిర్వాహణ, రోగులకు అందుతున్న వైద్య పరీక్షలు, కన్సల్టేషన్ రూమ్‌ల పనితీరు, టెలి క్లినిక్ సేవల అమలును సమీక్షించారు. ల్యాబ్‌లో జరుగుతున్న పరీక్షలు, నివేదికల జారీ విధానం, అవసరమైన పరికరాల అందుబాటు గురించి ఆరా తీశారు. ఫార్మసీ విభాగాన్ని తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అమలును పరిశీలించారు. ప్రభుత్వ వైద్యసేవలపై అభిప్రాయాలు, సమస్య ఉంటే ఆయా ఆస్పత్రుల్లో ప్రదర్శించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి (88855 92974) ప్రజలు నేరుగా తెలపొచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో నిత్యం జరిగే అన్నదాన పథకానికి భక్తులు విరాళాలు సమర్పించారు. విజయ వాడ సిద్ధార్థ్ధనగర్ ఐటీఐ కాలేజీ సమీపంలోని ఎల్‌ఐసీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఎన్.గోపాలకృష్ణ రూ.1,00,472 డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఆలయ అధికారులకు అందజేశారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన కొప్పుల మనీష, ఆయన కుటుంబసభ్యులు కలిసి రూ.1,35,516 విరాళంగా సమర్పించారు. దాతలకు అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్‌లో ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ అధికారులుగా ఉద్యోగోన్నతి కల్పించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక చేతుల మీదుగా వారికి ఉద్యోగోన్నతి పత్రాలను ఆమె చాంబర్‌లో బుధవారం అందజేశారు. సురేష్‌కుమార్‌ను మొవ్వ మండలం అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా, జగదీష్‌కుమార్‌ను కంచికచర్ల మండలం, దమయంతిని చాట్రాయి మండలం, కృష్ణబాబును కృత్తివెన్ను మండలం ఏఓగా నియమించారు. పీఐయూ డివిజన్ విజయవాడ కార్యాలయంలో పని చేస్తున్న సునీత జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏఓగా నియమించారు. దుర్గామల్లేశ్వరిని వీరులపాడు మండలం పరిషత్ ఏఓగా, సాయి గోపాల్‌ను గన్నవరం మండల పరిషత్ ఏఓగా ఉద్యోగోన్నతి కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆర్.సి.ఆనందకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
యూపీహెచ్‌సీలో కలెక్టర్ తనిఖీలు


