ప్రశాంతంగా ప్రారంభమైన జేఈఈ మెయిన్స్
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
ఐదు కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ
● ఉదయం 98.78, మధ్యాహ్నం
98.97 శాతం విద్యార్థులు హాజరు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): బీఈ, బీటెక్ ప్రవేశాల కోసం దేశ వ్యాపితంగా నిర్వహించే జేఈఈ (జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జిమినేషన్) మెయిన్స్ పరీక్ష ఉమ్మడి కృష్ణాజిల్లాలో బుధవారం ప్రశాతంగా ప్రారంభమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ఐదు కేంద్రాల్లో ఈ పరీక్ష కొనసాగింది. కంప్యూటర్ ఆధారంగా ఈ పరీక్ష నిర్వహించారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ రెండు విడతలుగా పరీక్ష జరిగింది. పరీక్షకు గంట ముందుగా విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించారు. ఉమ్మడి జిల్లాలోని గొల్లపూడికి చెందిన లైఫ్‌బ్రిడ్జి ఇన్ఫో టెక్నాలజీస్ (వాసవీ ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్), గవర్నర్‌పేట రామమందిరం రోడ్డులోని ఎస్‌వీటీ ఇన్ఫోటెక్, కండ్రికలోని ఐకాన్ డిజిటల్ జోన్ ఐడీజెడ్, కానూరు డొంకరోడ్డులోని శ్రీ విజయదుర్గ ఐటీ ఇన్ఫో సొల్యూషన్స్, కానూరులోని ఐకాన్ డిజిటల్ జోన్ ఐడీజెడ్ కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. తొలి రోజు మొదటి విడత ఐదు కేంద్రాలకు 2,701 మంది విద్యార్థులను కేటాయించగా 2,668 మంది హాజరయ్యారు. 33 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 98.78గా అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం రెండో విడత పరీక్షకు 2,707 మందికి 2,679 మంది విద్యార్థులు హాజరయ్యారు. 28 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 98.97గా నమోదైంది. కానూరు ఐకాన్ డిజిటల్ జోన్ ఐడీజెడ్ పరీక్ష కేంద్రంలో అత్యధికంగా షిఫ్టుకు 1,500 మంది విద్యార్థులను కేటాయించారు. సుమారు పది మంది పరిశీలకులను ఎన్‌టీఏ కేటాయించగా, పరీక్షను పరీక్ష జిల్లా సమన్వయకర్త జి.బర్నబాస్ పర్యవేక్షించారు.


