
తెలుగు వెలుగును భావి తరాలకు అందించాలి
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): తెలుగు భాష వెలుగులను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. పీబీ సిద్ధార్థ కళాశాల తెలుగు శాఖ, చెన్నపురి తెలుగు అకాడమీ (చైన్నె) సంయుక్తంగా ఆచార్య తూమాటి దొణప్ప శత జయంతి సంవ త్సరం సందర్భంగా విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ‘విశిష్ట తెలుగు దిగ్దర్శనం’ గ్రంథావిష్కరణ కార్యక్రమం శనివారం జరిగింది. ముఖ్యఅతిథి ముప్పవరపు వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మనిషి అవసరం రీత్యా ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరువకూడదన్నారు. ఆచార్య దోణప్ప తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ప్రాచీన తెలుగు విషయాలతో కూడిన గ్రంథాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, గిడుగు రామమూర్తిని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదని, వారి గొప్పతనాన్ని పిల్లలకు తెలపాలని కోరారు. మనదేశాన్ని భయపెట్టాలని అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించారు. మన దేశం ఆయిల్ ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తే అమెరికాకు ఎందుకని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సూరం శ్రీనివాసులు, డాక్టర్ తూమాటి సంజీవరావు, గుమ్మా సాంబశివరావు, తూమాటి ప్రేమ్‌నాథ్ పాల్గొన్నారు.
● సభ అనంతరం జరిగిన సదస్సులో తమిళ సాహిత్యంలో తెలుగు ప్రాచీనత – విశిష్టతపై డాక్టర్ గాలి గుణశేఖర్, విశిష్ట తెలుగు భాష నేపథ్యంపై గారపాటి ఉమామహేశ్వరరావు, విశిష్ట తెలుగు భాష – వ్యాకరణ ప్రాశస్త్యంపై డాక్టర్ లగడపాటి సంగయ్య, తెలుగు పాఠ్య ప్రణాళిక, పరిశోధనపై బీరం సుందరరావు, తెలుగులో వ్యాఖ్యాన విశిష్టత గురించి డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ, నేటి తెలుగు–స్థితిగతులు గురించి జాగర్లపూడి శ్యామ్‌సుందర శాస్త్రి ప్రసంగించారు.