
ఇకపై వలంటీర్ విధులను చేయం
మచిలీపట్నంటౌన్: నగరంలోని పలు సచివాలయాల్లో పనిచేస్తున్న వార్డు కార్యదర్శులు శనివారం వలంటీర్ విధులను బహిష్కరించారు. ఒకరి కంటే ఎక్కువ మంది వలంటీర్లు చేయాల్సిన పనిని తాము చేస్తున్నామని ఇకపై ఈ పనులు చేయమని వారు స్పష్టంచేశారు. ఈ మేరకు శనివారం వారు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లి గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శుల జేఏసీ ఆధ్వర్యంలో కమిషనర్ బాపిరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. తమపై రోజురోజుకు పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలని వలంటీర్ల పనిని చేయబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో నగరంలోని పలు సచివాలయాలకు చెందిన కార్యదర్శులు పాల్గొన్నారు.
చల్లపల్లి: సచివాలయ ఉద్యోగుల శక్తిని నిర్వీర్యం చేసేలా అధికార వర్గాలు ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా చల్లపల్లి మండల సచివాలయ ఉద్యోగులు శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఏపీ విలేజ్ వార్డు, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు తమ నిరసనను వినతి పత్రం రూపంలో ఎంపీడీఓ అనగాని వెంకట రమణకు అంద జేశారు. పి.శ్రవణ్‌కుమార్, పద్మారావు, పి.విష్ణు, కృష్ణకాంత్, శరణ్య, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన సచివాలయ కార్యదర్శులు