
నదిలో మునిగి యువకుడు మృతి
ఇసుక కోసం తవ్విన గుంటలే ప్రాణం తీశాయా?
ప్రమాదవశాత్తు
చల్లపల్లి: నదిలో నడిచి వస్తూ ప్రమాదవశాత్తు గోతిలో పడి ఓ యువకుడు నీటిలో మునిగిపోయి విగత జీవుడైన ఘటన మండల పరిధిలోని నిమ్మగడ్డ వద్ద కృష్ణానదిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ పీఎస్‌వీ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం చల్లపల్లి మండలం పురిటిగడ్డ పంచాయతీ శివారు నిమ్మగడ్డ గ్రామానికి చెందిన మేడేపల్లి శ్రీనివాసరావు కుమారుడు మేడేపల్లి తేజబాబు(20) శనివారం ఉదయం కృష్ణానది మధ్యలో ఉన్న తమ లంక పొలాలకు నదిలోని నీటిలో నడుచుకుంటూ వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మరొక వ్యక్తితో కలిసి తేజబాబు తిరిగి నది నీటిలో నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా మునిగిపోయాడు. ఎంతకీ పైకి తేలకపోవటంతో పక్కనున్న వ్యక్తి ఊళ్లో వారిని పిలుచుకొచ్చాడు. తేజబాబు మునిగిన చోట నీటి లోపల పెద్ద గుంట ఉండటంతో లోపల ఇరుక్కుపోయి ఉంటాడని గమనించిన స్థానికులు వలలు వేసి ప్రయత్నించారు. చాలా సేపటి తర్వాత తేజబాబు వలకు చిక్కి బయట పడ్డాడు. అప్పటికే అతను మృతిచెంది ఉన్నాడు. ఉదయం కళ్లెదుట కదలాడిన తేజాబాబు మధ్యాహ్నానికి విగత జీవుడిగా పడివుండటాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో నిమ్మగడ్డ గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. శ్రీనివాసరావుకు ఇద్దరు కుమారులు, ఒక పాప. తేజాబాబు పాలిటెక్నిక్ డిప్లొమా చదివి ఇటీవలే అప్రెంటీస్ పూర్తిచేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఎస్‌ఐ పీఎస్‌వీ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నిమ్మగడ్డ ప్రాంతంలో లంకకు కరకట్టకు మధ్య ఉన్న ప్రాంతంలో ఎక్కడపడితే అక్కడ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేయటంతో పెద్ద పెద్ద గుంటలు ఏర్పడ్డాయని, ఆ గుంటలే తేజబాబును బలి తీసుకున్నాయని పలువురు అంటున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి చూసీచూడనట్లు వదిలేసిన అధికారులు ఇందుకు బాధ్యులని ఆరోపిస్తున్నారు. నదిలో నీరు ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి రాకపోకలు సాగించాలని లంక రైతులను హెచ్చరిస్తున్నారు.