
గల్లంతైన యువకుడు శవమై కనిపించాడు
ఇబ్రహీంపట్నం: పవిత్ర సంగమం వద్ద సరదాగా ఈత కొడదామని శనివారం కృష్ణానదిలో దిగి గల్లంతైన కలకంటి నవీన్(17) ఆదివారం అదే ప్రాంతంలో శవమై పోలీసులకు కనిపించాడు. కనిపించకుండా పోయిన ప్రాంతంలో ఎస్డీఆర్‌ఎఫ్, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టకుండా ఇతర ప్రాంతంలో గాలించడం విమ ర్శలకు తావిచ్చింది. కనిపించకుండా పోయిన ప్రాంతంలోనే వెంటనే వెదికితే కుమారుడు బతికేవాడని అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. యువకుడి గాలింపులో ఎస్డీఆర్‌ఎఫ్, పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
జి.కొండూరు: టిప్పర్.. కారుని ఢీకొట్టిన ఘటనలో త్రుటిలో ప్రమాదం తప్పింది. కారులో ఉన్న తండ్రి, కుమార్తెకు ఎటువంటి గాయాలు కాలేదు. వివరాల్లోకి వెళ్తే.. మైలవరానికి చెందిన చర్చి పాస్టర్ విక్టర్‌బాబు ఆయన కూతురు రవి శిరీషని విజయవాడలో పరీక్ష రాయించేందుకు ఆదివారం ఉదయం తన కారులో బయలుదేరారు. ఈ క్రమంలో జి.కొండూరు మండల పరిఽ ది కట్టుబడిపాలెం వద్దకు రాగానే ఉదయం 8గంటల సమయంలో 30వ నంబరు జాతీయ రహదారిపై వెనక నుంచి వస్తున్న టిప్పర్.. కారుని క్రాస్ చేయబోయి ఢీకొట్టింది. ఘటనలో కారు పల్టీలు కొట్టుకుంటూ రహదారి డివైడర్‌పై ఉన్న ఇనుప రెయిలింగ్‌లో ఇరుక్కుపోయింది. ఘటనలో కారు ధ్వంసమైనా లోపల ఉన్న విక్టర్‌బాబు, రవి శిరీషకి ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో పరీక్షకు హాజరయ్యేందుకు వెంటనే వేరే కారులో వారిద్దరూ విజయవాడ వెళ్లిపోయారు.
కేఈబీ కాలువలో వృద్ధురాలు గల్లంతు
తోట్లవల్లూరు: కేఈబీ కాలువలో ప్రమాదవశాత్తు వృద్ధురాలు జారిపడి గల్లంతైన ఘటన రొయ్యూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లుక్కా వెంకటేశ్వరమ్మ(67) ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో కేఈబీ కాలువ వద్ద బట్టలు ఉతకటానికి వెళ్లింది. ఆ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడి గల్లంతైంది. ఆ ప్రాంతంలో గాలించినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవటంతో కుమారుడు లుక్కా శివనాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేడు ‘మండలి’ శత జయంతి
అవనిగడ్డ: మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు(ఎంవీకేఆర్) శత జయంతి ఉత్సవాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాలుగుచోట్ల సోమవారం నిర్వహించనున్నట్టు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సమితి ఆధ్వర్యంలో విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, అవనిగడ్డలో ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు జరుగుతాయని తెలిపారు.

గల్లంతైన యువకుడు శవమై కనిపించాడు

గల్లంతైన యువకుడు శవమై కనిపించాడు