
ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి
మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం సమాజ బాధ్యతగా మిగిలిందని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు ఎం.డి. షౌకత్ హుస్సేన్ అధ్యక్షత నిర్వహించిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కృష్ణా జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. తొలుత పి.రాందేవ్ జాతీయ పతాకాన్ని, ఎస్.పార్వతీశం ఎస్టీఎఫ్‌ఐ పతాకాన్ని, ఎం. ఆరోగ్య స్వామి యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు సమగ్ర శిక్ష పథకాన్ని సమర్థంగా అమలు చేసి బలమైన విద్యావ్యవస్థ నిర్మించాయని, కానీ ఆంధ్రలో మాత్రం చిన్న సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో నడుస్తున్న పాఠశాలలు పెరిగాయన్నారు. సమగ్ర శిక్ష పేరుతో విద్యాశాఖకు సమాంతరంగా వ్యవస్థను ఏర్పాటుచేసిన కూటమి ప్రభుత్వ విధానాలు పాఠశాల విద్యను నిర్వీర్యం చేశాయన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రభుత్వం బకాయి ఉన్న రూ.22 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని, 12వ వేతన సంఘాన్ని నియమించాలని, డీఏలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ యాప్‌లను రద్దు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం కొత్తగా 14 అంశాలతో కూడిన యాప్‌లు తీసుకువచ్చారన్నారు. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు కె.ఎ. ఉమామహేశ్వరరావు, ఎస్.పి. మనోహర్ కుమార్, ప్రధాన కార్యదర్శి బి. కనకారావు, కోశాధికారి ఎమ్. వరప్రసాద్, కార్యదర్శి టి. సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.