
పిడుగుపాటుకు మహిళా కూలీ మృతి
●ఇద్దరికి తీవ్ర గాయాలు
●కోడూరు నరసింహపురంలో వరినాట్లు వేస్తుండగా ఘటన
కోడూరు: పిడుగుపాటుకు ఓ మహిళా కూలీ పొలంలో మృతి చెందారు. మరో ఇద్దరు మహిళా కూలీలకు తీవ్ర గాయాలైన ఘటన కోడూరు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని ఇరాలి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు రోజు మాదిరిగానే ఆటోలో వివిధ ప్రాంతాలకు వ్యవసాయ పనుల కోసం వెళ్లారు. వీరితో కొంతమంది మండల పరిధిలో నరసింహపురం గ్రామ సమీపంలోని పొలాల్లో వరినాట్లు వేసేందుకు వెళ్లారు. కూలీలు వరినాట్లు వేస్తుండగా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అప్పుడు నరసింహపురం సమీపంలో కూలీలు వరినాట్లు వేస్తున్న ప్రాంతంలో భారీ శబ్దంతో పిడుగు పడింది. పిడుగుపాటుకు వరినాట్లు వేస్తున్న మహిళా కూలీ గంజాల కొండలమ్మ (30) పొ లంలోనే కుప్పకూలింది. కొండలమ్మ పక్కన ఉన్న మరో ఇద్దరు కూలీలు గంజాల జ్యోతి, గంజాల పార్వతి కూడా పడిపోయారు.
మృతి చెందిన కొండలమ్మ..
పిడుగుపాటుకు గురైన ముగ్గురు మహిళా కూలీలను స్థానికులు హుటాహుటినా అవనిగడ్డలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే కొండలమ్మ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జ్యోతి, పార్వతిలకు తీవ్ర గాయాలు కావడంతో వీరికి చికిత్స చేస్తున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామాలో విషాదఛాయలు అలము కున్నాయి.