
వృద్ధురాలిని బెదిరించి బంగారు గొలుసు అపహరణ
గన్నవరం: ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కత్తులతో బెదిరించి సుమారు మూడు కాసుల విలువైన బంగారు గొలుసును దొంగ అపహరించుకుపోయిన ఘటన ఉంగుటూరు మండలం వెన్నుతలలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. గ్రామంలోని ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన ఇంటిలో బొమ్మి సింహాచలంతో పాటు ఆమె కుమారుడు, కోడలు నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడుకు, కోడలు బంధువుల ఊరెళ్లగా శనివారం రాత్రి ఇంటి వెనుక గదిలో ఆమె నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇంటి తలుపులు గట్టిగా కొట్టిన అలికిడి విని ఆమె భయపడుతూ తలుపులు తీసింది. అయితే ఎవరూ కనిపించకపోవడంతో తలుపులు తీసి ఉంచి మంచంపై కూర్చుంది. కొద్దిసేపటికి ముఖానికి మాస్కు ధరించి వచ్చిన దొంగ చేతిలోని రెండు కత్తులతో బెదిరించి ఆమె మెడలోని మూడు కాసుల విలువైన బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. జరిగిన విషయాన్ని కుమారుడు, కోడలికి ఫోన్‌లో తెలియజేయడంతో ఉదయం ఊరు నుంచి తిరిగివచ్చి ఉంగుటూరు పోలీసులను ఆశ్రయించారు. సీఐ బీవీ శివప్రసాద్, ఎస్‌ఐ యు. గోవిందు ఘటన స్థలాన్ని పరిశీలించి వృద్ధురాలి నుంచి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపి నిందితుడి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. బీరువా పగలకొట్టిన దొంగ అందులోని నగదు, ఇతర వస్తువులను మాత్రం అపహరించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోవిందు తెలిపారు.
వీఎఫ్‌సీ ఫుడ్స్ షాపులో అగ్ని ప్రమాదం
జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని జేఆర్‌సీ కాలేజీ రోడ్‌లోని వీఎఫ్‌సీ ఫుడ్స్ దుకాణంలో శనివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలో నాన్‌వెజ్, వెజ్ ఆహార పదార్థాలు తయారుచేస్తుంటారు. విద్యుత్ పరికరాలతో వేడి చేసి వినియోగదారులకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, గ్రైండర్లు, తదితర ఎలక్ట్రికల్ పరికరాలు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. విద్యుత్ సిబ్బంది కరెంట్ సరఫరాను నిలిపివేసి ప్రమాద నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. ఫైర్ సిబ్బంది గ్యాస్ సిలిండర్లను సకాలంలో బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ ఆఫీసర్ కె.శ్రీనివాసరావు తెలిపారు.