లబ్బీపేట(విజయవాడతూర్పు): తల్లిపాలకు ఎంతో విశిష్టత ఉంది. బిడ్డకు తల్లిపాలు అమృతంలా పనిచేస్తాయి. పుట్టిన అర్ధగంటలోపు తల్లిపాలు ఇవ్వడం ద్వారా శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు, మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. నేటి ఫ్యాషన్ ప్రపంచంలో చాలా మంది బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం లేదు. అలాంటి పిల్లల ఎదుగుదలలో లోపాలు కనిపిస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కృత్రిమ పాలతో పనిలేకుండా పాలు లేని, రాని తల్లుల పిల్లల కోసం ఇప్పుడు మదర్ మిల్క్ బ్యాంకులు ఏర్పాట య్యాయి. ఆ మిల్క్ బ్యాంక్ తల్లుల నుంచి పాలను సేకరించి ప్రాసెసింగ్ చేసి మిల్క్ బ్యాంకుల్లో ఉంచుతున్నారు. వాటిని అవసరమైన పిల్లలకు ఇస్తు న్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ పిల్లలకు తల్లిపాల విశిష్టతను తెలియచేసేందుకు ఏటా ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది.
తల్లిపాలు శిశువులకు ఎంతో మేలు
● తల్లిపాలలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. చిన్నారులకు వ్యాధి నిరోధకశక్తి కూడా సమకూరుతుంది.
● తల్లిపాలు తాగిన శిశువుల్లో యాంటీబాడీస్ వృద్ధి చెంది ఇన్‌ఫెక్షన్లు, నిమోనియా, డయేరియా వంటి వ్యాధులు సోకకుండా నివారించొచ్చు.
● మెదడు ఎదుగుదలకు దోహదం చేయడంతో పాటు, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి.
● పసిబిడ్డకు ప్రధాన శత్రువు చలి. బిడ్డను వడిలో ఉంచుకుని పాలివ్వడం ద్వారా తల్లి శరీరం నుంచి శిశువుకు అవసరమైన వేడి అందుతుంది. అంతేకాదు తల్లీబిడ్డల మధ్య ఆప్యాయత పెరుగుతుంది.
● ముర్రుపాలు బిడ్డలో వ్యాధి నిరోధకశక్తిని పెంచు తుంది. అంతేకాదు శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే పదార్థాలు, విటమిన్–ఏ పుష్కలంగా ఉంటాయి.
● శిశువు మొట్టమొదట విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు, పచ్చకామెర్లు కలిగించే బెలూరుబిన్ అనే పదార్థాన్ని కూడా త్వరగా విసర్జించేలా ముర్రుపాలు దోహదం చేస్తాయి. బిడ్డకు మొదటి వారంలో కలిగే పచ్చకామెర్లును నివారిస్తాయి.
తల్లికీ ఉపయోగం
బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. బిడ్డకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బులు రావని పేర్కొంటున్నారు. బిడ్డకు పాలివ్వడం ద్వారా ప్రసవం అనంతరం అయ్యే రక్తస్రావం అదుపులోకి వస్తుందని వివరిస్తున్నారు.
శిశు మరణాల నివారణ
ఎక్కువ మంది శిశువులకు ఇన్‌ఫెక్షన్స్‌లు సోకడం, పుట్టగానే కామెర్లు, శ్వాసకోశవ్యాధులతో మరణాలు సంభవించడాన్ని యూనిసెఫ్ గుర్తించింది. అలాటి మరణాలను నివారించేందుకు పుట్టిన అర్ధగంటలోపు తల్లిపాలు తాగించడం ద్వారా నెలలోపు శిశువుల్లో సంభవించే మరణాలను తగ్గించొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దీంతో తల్లిపాల ఆవశ్యకతపై గర్భిణులుగా ఉన్నప్పటి నుంచే విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు.
అమ్మపాలతో బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెంపు తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువ పుట్టిన అర్ధగంటలోపు తల్లిపాలు ఇవ్వాలి తాజాగా అందుబాటులోకి మదర్ మిల్క్ బ్యాంకులు నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు

అమృతం.. ఆరోగ్య కవచం