ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు భక్తులు గురువారం విరాళాలు సమర్పించారు. విజయవాడ భారతీనగర్‌కు చెందిన పర్వతనేని అతిథి కుటుంబం రూ.లక్ష, పటమటకు చెందిన ఎం. నాగేశ్వరరావు కుటుంబం రూ.1,00,116, సీతారామపురానికి చెందిన పిన్నింటి దుర్గారవికిరణ్ కుటుంబం రూ.1,01,116 విరాళం అందజేశారు.
పెనమలూరు మండలం కానూరుకు చెందిన విశ్వనాథం గోవిందయ్య కుటుంబం నిత్యాన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళాన్ని ఆలయ ఈఓ శీనానాయక్‌కు అందజేసింది. హైదరాబాద్ కర్మల్‌ఘాట్‌కు చెందిన ఎం.రాఘవకుమార్, రమాదేవి దంపతులు రూ.1,01,116 విరాళం సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండి తుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఈఓ శీనానాయక్, ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
సరుకుల పంపిణీపై నిరంతర పర్యవేక్షణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా నిరాటంకంగా సరుకుల పంపిణీ జరుగుతోందని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్‌ను కలెక్టర్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో 957 రేషన్ దుకాణాల పరిధిలో 5.90 లక్షల రైస్ కార్డులు ఉన్నాయని, ప్రతినెలా కార్డుదారులకు 8,400 టన్నుల బియ్యాన్ని ఉచితంగా పంపిణీచేస్తున్నామని తెలిపారు. 52 గ్యాస్ ఏజెన్సీల ద్వారా ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా జరుగుతోందని, దీపం 2.0 పథకాన్ని పటిష్టంగా అమలుచేస్తున్నామని వివరించారు.
ఎలాంటి లోటుపాట్లు లేకుండా పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు నిరంతర పర్యవేక్షణతో పాటు క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహిన్నామని తెలిపారు. రేషన్ దుకాణాలు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు జవాబుదారీతనంతో పనిచేసేలా చూస్తున్నట్లు వెల్లడించారు. కొత్త రైస్ కార్డులు, రేషన్ కార్డులో సభ్యుల చేరిక, అడ్రస్ మార్పు, ఆధార్ సీడింగ్ తదితర సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఎ.పాపారావు తదితరులు పాల్గొన్నారు.
కూచిపూడి నాట్య పరీక్షలో నూరు శాతం ఉత్తీర్ణత
కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యకళా పీఠంలో 2023–25 విద్యా సంవత్సరం ఎంపీఏ (మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్) పరీక్షలలో 17 మందికి 17 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని కళాపీఠం ప్రధాన ఆచార్యుడు డాక్టర్ ఎం.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. విద్యార్థులకు సంబంధించిన మార్కుల జాబితాలు విశ్వవిద్యాలయం నుంచి నాట్యకళా పీఠానికి చేరాయని పేర్కొన్నారు.
9.65 గ్రేడ్ పాయింట్లతో ఏరా భార్గవి, కె.శ్రీలత మొదటి స్థానం దక్కించుకోగా, 9.60 గ్రేడ్ పాయింట్లతో వసుధ, 9.20 గ్రేడ్ పాయింట్లతో శ్రీవత్సల రెండు మూడు స్థానాల్లో నిలిచారని వివరించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, టీచింగ్ అసిస్టెంట్ డాక్టర్ దుర్గాభవాని (సంగీతం), పసుమర్తి హరినాథశాస్త్రి (మృదంగం), లైబ్రేరియన్ ఏలేశ్వరపు వెంకటేశ్వర ఫణి కుమార్ తదితరులు అభినందించారు.

నిత్యాన్నదానానికి విరాళాలు