
వరద ప్రవాహంపై అప్రమత్తంగా ఉండాలి
ఇబ్రహీంపట్నం: ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి పెరుగుతున్న వరద ప్రవాహంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. మండలంలోని చినలంక, పెద్దలంక, ఫెర్రీ తదితర ప్రాంతాలను ఆయన గురువారం సందర్శించారు. చినలంక వద్ద అర కిలోమీటర్ దూరంలో నాలుగు అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వరదనీటిని పరిశీలించారు. వరద నీటితో కలిగిన ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పులిచింతల నుంచి వరద నీరు నిలకడగా వస్తోందన్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ పైకిఎత్తి నీటిని కిందకు విడుదలచేస్తూ లోతట్టు ప్రాంతాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామన్నారు. బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, పంచాయతీరాజ్, మునిసిపల్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా ఆదేశాలు ఇచ్చామని వివరించారు. గురువారం సాయంత్రం నాటికి వరద ఉధృతి మూడు లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉన్నందున కృష్ణానది పరీవాహక ప్రాంతాల ప్రజలు వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. చేపల వేటకు వెళ్లడం, పశువులు, జీవాలు వదలడం చేయొద్దని సూచించారు. వరదకు సంబంధించి ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌లో 91549 70454 నంబరుతో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. అవసరమైతే ట్రక్ టెర్మినల్‌ల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. వరద పరిస్థితిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆర్డీఓ చైతన్య, తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, మునిసిపల్ కమిషనర్ రమ్య కీర్తన తదితరులు పాల్గొన్నారు.
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి వరద పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ జరపాలి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ

వరద ప్రవాహంపై అప్రమత్తంగా ఉండాలి