
రెడ్‌క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయం
మచిలీపట్నంఅర్బన్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనమని కృష్ణా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మంది రంలో సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా గీతాంజలి శర్మ మాట్లాడుతూ.. సమాజ సేవే పరమార్థంగా పని చేస్తున్న ఈ సొసైటీకి మరింత బలాన్నిచ్చేలా జిల్లాలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లాకు సేవల పరంగా కలెక్టర్ డి.కె.బాలాజీ అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వారిని గుర్తించేందుకు, రెగ్యులర్ కలెక్టర్ వచ్చేంత వరకు కొత్త కమిటీ ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలిపారు. రాష్ట్ర పరిశీలకుడు రామచంద్రరాజు మాట్లాడుతూ.. ఐఆర్సీఎస్ సభ్యులు స్వచ్ఛందంగా సేవ చేసే వారేనని పేర్కొన్నారు. తెనాలిలో రక్తదాన కేంద్రానికి స్థలం కేటాయించిన గీతాంజలి శర్మ స్పందనను ప్రశంసించారు. అనంతరం ఐఆర్సీఎస్ కార్యదర్శి బి.శంకర్‌నాథ్ మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం రెడ్ క్రాస్ ఫౌండర్ హెన్రీ డోనాంట్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశీలకులు రామచంద్రరాజు, చైర్మన్ బాలాజీ, కార్యదర్శి శంకర్‌నాథ్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మను ఘనంగా సత్కరించారు. ఐఆర్సీఎస్ సేవలు అందించిన డీఆర్వో కె.చంద్రశేఖరరావు, చైర్మన్ బాలాజీతో పాటు సమాజ సేవలో చురుకుగా పాల్గొన్న సభ్యులు, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఆర్. వెంకట్రావు, ఆర్‌ఐఓ సాల్మన్ రాజు, పలువురు తహసీల్దారులు ఇన్‌చార్జి కలెక్టర్ చేతులమీదుగా సత్కారం అందుకున్నారు.