
బ్యాంకులు భద్రతా ప్రమాణాలు పాటించాలి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల ప్రకారం బ్యాంకు అధికారులు బ్యాంకులతో పాటు ఏటీఎంల వద్ద నిర్దేశించిన భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు పేర్కొన్నారు. కృష్ణాజిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ బ్యాంక్‌ల అధికారులతో సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం ఎస్పీ బ్యాంకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశపు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. బ్యాంకుల్లో సీసీ కెమెరాల పనితీరు, సెక్యూరిటీ గార్డుల నియామకం, సురక్షిత నగదు రవాణా, ఆన్‌లైన్ మోసాల నివారణ, సైబర్ భద్రత వంటి అంశాలపై అధికారులు జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. బ్యాంకుల్లో కొత్తగా నియమించుకునే ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ముందస్తు పోలీసుల పరిశీలన తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని ఏటీఎంల వద్ద సీసీ కెమెరాలను తప్పనిసరిగా అమర్చాలని, వాటి పనితీరును పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని స్పష్టంచేశారు. రాత్రి వేళ ఏటీఎం ప్రాంగణాలు వెలుతురుతో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించాలని, అత్యవసర పరిస్థి తుల్లో పోలీసులకు వెంటనే సమాచారం చేరేలా అలారం లేదా లింకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సీసీ కెమెరాల డేటా కనీసం 30 రోజులు నిల్వ ఉండేలా జాగ్రత్తలు చూసుకోవాలని స్పష్టం చేశారు. సైబర్ నేరాలపై ఖాతాదారులకు పూర్తి అవగాహన కలిగించే బాధ్యతను బ్యాంకులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, డీఎస్పీలు సిహెచ్.రాజా, శ్రీనివాసరావు, ధీరజ్ నీల్, విద్య శ్రీ పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు