
పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
పెనమలూరు: మండల పరిధిలో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఇంత కాలం ఎడారిలా తలపించిన కృష్ణా నదికి ఎగువన కురిసిన వర్షాలతో వరద వచ్చింది. మండల పరిధిలోని యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం ఘాట్‌ల వద్దకు నదిలో వరద నీరు చేరుకుంది. దాదాపు 3 లక్షల క్యూసెక్కుల వరద రావటంతో కృష్ణానదిలో జలకళ ఏర్పడింది. అయితే నదిలో వరద 5 లక్షల క్యూసెక్కులు వస్తే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నివాసాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. నదిలోకి ఎవరూ దిగకుండా ఆయా గ్రామ పంచాయతీల పాలకులు, అధికారులు చర్యలు తీసుకున్నారు. గత ఏడాది వరదల కారణంగా తీర ప్రాంత వాసులు చాలా నష్టపోయారు. ఇప్పుడు మళ్లీ వరద ఉధృతి పెరిగితే చాలా ఇబ్బందులు పడతామని వారు వాపోతున్నారు. ఎంపీడీవో బండి ప్రణవి, ఆయా పంచాయతీల కార్యదర్శులు తీర ప్రాంత గ్రామాల్లో నది వద్దకు వెళ్లి తాజా పరిస్థితులు పరిశీలించారు.