
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
అవనిగడ్డ: పెళ్లికి పెద్దలు అభ్యంతరం చెప్పడంతో ఆలయంలో పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే స్థానిక ఆరో వార్డుకు చెందిన చింతలపూడి నాగవర్థన్, బాపట్ల జిల్లా రేపల్లె ఏడవ వార్డుకు చెందిన తోట సాయి మౌనిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి మౌనిక తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో గురువారం మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలు అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఈ ప్రేమజంట స్థానిక ఎస్‌ఐ శ్రీనివాస్‌ని ఆశ్రయించడంతో ఇరువురు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ కోసం సమాచారం ఇచ్చారు. మౌనిక తల్లిదండ్రులు రాకపోవడంతో నాగవర్థన్ తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు.
మహిళా జూదరులు అరెస్ట్
పెడన: పట్టణంలో పేకాడుతున్న ఐదుగురు మహిళలను పెడన పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పెడన ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు అందిన సమాచారంతో పైడమ్మ కాలనీలో పేకాడుతున్న ఐదుగురు మహిళలను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.12,350 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
నదిలో చిక్కుకున్న వ్యక్తిని ఒడ్డుకు చేర్చిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో చిక్కుకుని కేకలు వేస్తున్న ఓ వ్యక్తిని ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం కాపాడి ఒడ్డుకు చేర్చిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిఽధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నున్నకు చెందిన అంకా సెల్వరాజ్ బుధవారం రాత్రి కృష్ణానదిలోకి వెళ్లి వారధి 42వ పిల్లర్ వద్ద ఇసుక తిన్నెల్లో పడుకుని నిద్రపోయాడు. గురువారం ఉదయం లేచి చూడగా అతని చుట్టూ వరద నీరు చేరుతుండడంతో భయంతో కేకలు పెట్టాడు. వారధి పైన వెళ్తున్న ప్రయాణికులు కేకలు విని అతనిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కృష్ణలంక పోలీసులు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందంతో ఘటనా స్థలానికి చేరుకుని పడవ ద్వారా అతని వద్దకు చేరుకుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అతని వివరాలను సేకరించిన పోలీసులు మతిస్థిమితం లేని వ్యక్తిగా నిర్ధారించారు.

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట