
పాడి రైతులకు రూ.13 కోట్ల బోనస్
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): పాడి రైతులకు ఆర్థిక భరోసాతో పాటు ఆరోగ్య భరోసా కల్పించేందుకు కృష్ణా మిల్క్ యూనియన్ ఎల్లవేళలా కృషి చేస్తుందని చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. పాలప్రాజెక్టు ఆవరణలోని బోర్డు సమావేశ మందిరంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ 2025 ఏప్రిల్–జూన్‌కు సంబంధించి పాడి రైతులకు రూ.13 కోట్లు బోనస్‌గా అందిస్తున్నామన్నారు. పాడి రైతులకు అత్యధిక పాల సేకరణ ధరను సకాలంలో చెల్లిస్తూ, ఏడాదిలో మూడు పర్యాయాలు బోనస్‌ను కృష్ణా మిల్క్ యూనియన్ అందిస్తుందన్నారు. పాడి రైతుల ఆరోగ్యం కోసం తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించేలా ఆశ్రం హాస్పిటల్‌తో పాటు చిన్న అవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఆయా హాస్పిటల్స్‌లో పాడి రైతులకు రాయితీతో కూడిన వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ వైద్య సేవలను ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పాడిరైతులు వినియోగించుకోవచ్చునన్నారు. పాడి పశువుల కోసం పంపిణీ చేసే సెమెన్ డోస్ రూ.150లు కాగా, ఉమ్మడి కృష్ణాజిల్లాలో పాడి రైతులకు కేవలం రూ.50కే అందించి, మిగిలిన రూ.వంద సబ్సిడీని కృష్ణా మిల్క్ యూనియన్ చెల్లిస్తుందన్నారు. కేవలం కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతులే కాకుండా జిల్లాలోని పాడి రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చునన్నారు. సమావేశంలో ఆశ్రం హాస్పిటల్ సీఈవో హనుమంతరావు, పిన్నమనేని హాస్పిటల్ సూపరింటెండెంట్ అనిల్, విజయ డెయిరీ ఎండీ కొల్లి ఈశ్వరబాబు, జిల్లా లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్, బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు.
విజయ డెయిరీ చైర్మన్ చలసాని