
శేష జీవితాన్ని సంతోషంగా గడపండి
కోనేరుసెంటర్: పోలీసుశాఖకు ఉత్తమ సేవలను అందించి సంపూర్ణ ఆరోగ్యంతో ఉద్యోగ విరమణ పొందుతున్న సిబ్బంది తమ శేష జీవితాన్ని కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపేలా భగవంతుడు ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందిని గురువారం ఎస్పీ జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ హాలులో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం కత్తిమీద సాములాంటిదని, కుటుంబం కంటే వృత్తికే అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చి విధులు నిర్వర్తించిన మీరంతా ఇతరులకు స్ఫూర్తి ప్రదాతలని అన్నారు.
కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌ఐలు కె.బలరామ్, యు.ఎల్.సుబ్రహ్మణ్యం, ఎస్.వెంకటేశ్వరరావు, ఆర్‌ఎస్‌ఐ మహమ్మద్ ముస్తఫాలను వారి కుటుంబసభ్యుల నడుమ ఘనంగా సత్కరించి వారి కుటుంబ నేపథ్యాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల చదువులు, వారి ఉద్యోగాలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, బందరు డీఎస్పీ సీహెచ్ రాజా, ఏఆర్ డీఎస్పీ పి.వెంకటేశ్వరరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు