
మోటార్ల దొంగల ముఠా అరెస్ట్
● ముఠా నాయకుడు జనసేన నేత కావడంతో కేసును నీరు గార్చిన పోలీసులు ● పట్టుకున్నది 60 మోటార్లు.. చూపించింది 12 మాత్రమే
కోడూరు: ఇంటి ఆవరణతో పాటు ప్రభుత్వ సముదాయాల్లో ఉన్న మోటార్లను అపహరించే దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకొని, అధికార పార్టీ ఒత్తిళ్లతో కేసును నీరుగార్చారనే విమర్శలు దివిసీమలో కలకలంరేపాయి. మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఇళ్ల వద్ద ఉండే మోటార్లను గుర్తు తెలియని దుండగులు అపహరిస్తున్నారు. నెల రోజులుగా మోటార్ల అపహరణపై బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు అందించారు. వారం క్రితం పిట్టల్లంక పంచాయతీ కార్యాలయంలో ఉన్న విద్యుత్ మోటార్‌ను దొంగల ముఠా అపహరించింది. దీంతో పంచాయతీ అధికారులు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసును చేధించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పిట్టల్లంక గ్రామానికి చెందిన శీలం కల్యాణ్‌రామ్, బావిశెట్టివారిపాలెం గ్రామానికి చెందిన సింగంశెట్టి సాయి శ్రీనివాసరావులు మోటార్లను అపహరిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు పిట్టల్లంక సమీపంలోని ఓ రొయ్యల చెరువుల వద్ద పని చేస్తున్నారు. వీరిని మోటార్ల దొంగతనం చేసేందుకు సంబంధిత చెరువు యజమాని ప్రేరేపించినట్లు పోలీసులు తమ విచారణలో నిర్ధారించారు. ఇద్దరు యువకులతో పాటు చెరువు యజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
జనసేన నేత దొంగల ముఠా నాయకుడు..
మోటార్ల దొంగల ముఠాను ముందుండి నడిపిన చెరువుల యజమాని జనసేన నేత కావడంతో ఈ కేసును పోలీసులు నీరుగార్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువు యజమానిని కేసు నుంచి తప్పించేందుకు నియోజకవర్గం, మండలంలోని జనసేన నేతలు పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇద్దరు యువకులను బలి చేసి అసలు ముఠా నాయకుడిని వదిలేసేందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసు చేధనలో పోలీసులు నిందితుల నుంచి 60కు పైగా మోటార్లను రికవరీ చేసినట్లు సమాచారం. కేసులోని నిందితులను శుక్రవారమే అరెస్టు చేసినా కూడా సమాచారాన్ని మీడియాకు ఇవ్వలేదు. మోటార్ల దొంగల గురించి సామాజిక మాధ్యమాల్లో రావడంతో కంగుతిన్న పోలీసులు శనివారం ఉదయం ఈ కేసుకు సంబంధించి ప్రెస్‌నోట్‌ను హడావుడిగా విడుదల చేశారు. ఈ ప్రెస్‌నోట్‌లో కూడా ఇద్దరు యువకులనే నిందితులుగా చూపించారు గానీ అసలైన ముఠా నాయకుడి ప్రస్తావన చేయలేదు. ఈ కేసులో రూ.1.35 లక్షల విలువైన 12 మోటర్లు రికవరీ చేసినట్లు అవనిగడ్డ సీఐ యువకుమార్, ఇన్‌చార్జి ఎస్‌ఐ రాజేష్ పేర్కొన్నారు.
నిందితులకు స్టేషన్ బెయిల్ మంజూరు
మోటార్లను భారీ ఎత్తున చోరీ చేసిన నిందితులకు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితులపై పోలీసులు సరైన సెక్షన్లు నమోదు చేయకుండా కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించడంపై బాధితులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఎస్పీ ఈ మోటార్ల చోరీ ఘటనపై సమగ్రమైన విచారణ జరిపాలని బాధితులు కోరుతున్నారు.