
అప్రజాస్వామికం
ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును ఖండించిన వైఎస్సార్ సీపీ నేతలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి సంఘీభావంగా రాష్ట్రం నలుమూలల నుంచి నేతలు, అభిమానులు నగరానికి తరలివచ్చారు. లిక్కర్ స్కామ్ పేరుతో కట్టుకథలు అల్లుతూ.. ఎలాంటి ఆధారాలు లేకుండా.. అక్రమ కేసులో అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం తీరును, పోలీసులు వ్యవహరిస్తున్న వైనాన్ని ప్రతి ఒక్కరూ తప్పుపట్టారు. వైఎస్సార్ సీపీ నేతలు, మిథున్ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సిట్ కార్యాలయం, పరిసర ప్రాంతాల్లో జనసందోహంగా మారాయి. ఆధారాలు లేని కేసులో ఎంత మందిని అరెస్టు చేసుకుంటూ వెళ్తారంటూ మీడియా వేదికగా మండిపడ్డారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు.
కర్ఫ్యూ వాతావరణం..
వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విచారణకు హాజరైన దగ్గర నుంచి అరెస్టు, కోర్టులో హాజరు పరిచే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై పలువురు మండిపడుతున్నారు. సిట్ కార్యాలయం వద్ద వందలాది మంది పోలీసులతో బందోబస్తు పెట్టి, రాకపోకలను నిషేధిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేసి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించేలా చేశారంటున్నారు. అంతేకాకుండా వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లిన ప్రభుత్వాస్పత్రి వద్ద, అనంతరం సివిల్ కోర్టుల వద్ద పోలీసుల తీరు అలాగే ఉండటంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన సమీపానికి సైతం ఎవరినీ రాకుండా అడ్డుకోవడంపై మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలతో అణచి వేయాలని చూస్తే రెట్టింపు ఉత్సాహంగా పైకి లేస్తామని నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు.
ప్రజలంతా చూస్తున్నారు..
కూటమి ప్రభుత్వం ఏడాదిగా చేస్తున్న అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఇది కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసు. ఎన్ని కుట్రలు చేసినా, కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. – భరత్, ఎమ్మెల్సీ, కుప్పం

అప్రజాస్వామికం

అప్రజాస్వామికం