
సారె తెచ్చి.. కనులారా దర్శించి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ మాసం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు సోమవారం సారెను సమర్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి విచ్చేసిన భక్తులతో ఇంద్రకీలాద్రి కళకళలాడింది. అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా భావించే భక్తులు ఆషాఢ సారెను సమర్పిస్తున్నారు. దుర్గగుడిలో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న ఎజైల్ సెక్యూరిటీ సర్వీసెస్ సిబ్బంది సోమవారం అమ్మవారికి సారెను సమర్పించారు. జమ్మిదొడ్డి ఆవరణలోని రావిచెట్టు వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి పూజా కార్యక్రమాలు చేశారు. ఆలయ ఈవో శీనానాయక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఆలయ ఏఈవోలు చంద్రశేఖర్, ఎన్.రమేష్‌బాబు అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్నారు.
మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ
మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్న సిబ్బంది అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు, భక్త బృందాలు సారె సమర్పించేందుకు క్యూలైన్‌లో బారులు తీరారు. మూలవిరాట్‌ను దర్శించుకున్న అనంతరం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి సారెను సమర్పించారు.
24తో ముగియనున్న ఆషాఢ ఉత్సవాలు
ఈ నెల 24వ తేదీతో ఆషాఢ మాసోత్సవాలు ముగియనున్నాయి. ఆషాఢ మాసం చివరికి చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి సారెను సమర్పిస్తున్నారు. మంగళవారం ఆలయ అన్నదాన విభాగం, శానిటేషన్ విభాగం వేర్వేరుగా అమ్మవారికి సారెను సమర్పించనున్నారు.
దుర్గమ్మకు సారె సమర్పిస్తున్న
భక్త బృందాలు

సారె తెచ్చి.. కనులారా దర్శించి