బందరులో పీడీ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తల ధర్నా
మచిలీపట్నంటౌన్: ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని రద్దు చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ సేవలు అందించేందుకు తప్పనిసరి చేసిన ముఖ గుర్తింపు విధానం (ఎఫ్‌ఆర్‌ఎస్)ను రద్దు చేయాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు సోమవారం స్థానిక పోర్ట్ రోడ్డులోని పీడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ ఈ విధానంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. సర్వర్ పని చేయక ఎఫ్‌ఆర్‌ఎస్ పడక సమయం వృథా అవుతుండటంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలపై వేధింపులను నివారించడానికి అధికారులు స్పందించాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రమాదేవి, సీఐటీయూ నేత సుబ్రహ్మణ్యం, మచిలీపట్నం ప్రాజెక్టు అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు సీహెచ్ నాంచారమ్మ, కార్యదర్శి రెజీనారాణి, సెక్టర్ నాయకురాలు లక్ష్మి, సీతారత్నం, విజయశ్రీ, సుజాత, సౌజన్య, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
పోలవరం కాల్వలో పడి వ్యక్తి గల్లంతు
పాయకాపురం(విజయవాడరూరల్): పాతపాడు గ్రామం వద్ద పోలవరం కాల్వలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్ళిన వ్యక్తి కాలుజారి కాల్వలో కొట్టుకెళ్ళినట్లు వచ్చిన ఫిర్యాదుపై నున్న పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ప్రకాష్‌నగర్ కు చెందిన పత్తివాడ మధుసూదన్ (26) క్యాటరింగ్ పనులు చేస్తుంటాడు. ఆదివారం తన స్నేహితులతో కలిసి పాతపాడు గ్రామం వెళ్లారు. స్నేహితులతో మద్యం సేవించిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో పోలవరం కాల్వలో పడి కొట్టుకెళ్లిన మధుసూదన్ కోసం గాలించినా ఆచూకి దొరకలేదని మధుసూదన్ తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతని ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.
ఎఫ్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయండి