
నేడు 10 నుంచి 3 గంటల వరకు టికెట్ల విక్రయాలు రద్దు
అన్ని క్యూలైన్లలో ఉచితంగా దర్శనాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం నేపథ్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంద్రకీలాద్రిపై దర్శన టికెట్ల విక్రయాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. ఆషాఢ మాసం అమ్మవారికి సారెను సమర్పించేందుకు భక్తులు, భక్త బృందాలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వీఐపీ దర్శనాలు, అంతరాలయ దర్శనాలను సైతం రద్దు చేస్తున్నామన్నారు. బంగారు వాకిలితో పాటు సర్వదర్శనం క్యూలైన్లు మూడు, మరో రెండు క్యూలైన్ల ద్వారా అమ్మవారి దర్శనానికి ఉచితంగా అనుమతిస్తామన్నారు. వృద్ధులు, చంటి పిల్లలతో దర్శనాలు వచ్చే తల్లులు ఉదయం 10 గంటల లోపు, మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రమే రావాలన్నారు. భక్తులు సహకరించాలని ఈఓ కోరారు.
గుర్తు తెలియని
మృతదేహాల లభ్యం
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సీతమ్మ వారి పాదాల సమీపంలోని శనైశ్వరస్వామి గుడి వెనుక వైపు కృష్ణానదిలో నీటిలో ఓ మృతదేహం తేలుతున్నట్లు శనివారం ఉదయం సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నదిలో నుంచి బయటకు తీశారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. మృతుడి వయస్సు 45 ఏళ్లు ఉండవచ్చని, డార్క్ బ్లూ కలర్ టీ షర్ట్, గ్రే కలర్ ఫ్యాంట్, గ్రీన్ కలర్ బెల్టు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో లేదా 98498 08555 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
రొయ్యూరులో వృద్ధురాలి మృతదేహం..
తోట్లవల్లూరు: రొయ్యూరు సమీపాన కేఈబీ కాలువలో గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం శనివారం లభ్యమైనట్లు తోట్లవల్లూరు ఎస్‌ఐ సీహెచ్ అవినాష్ తెలిపారు. మృతదేహం బాగా పాడైపోయిన స్థితిలో ఉందన్నారు. మృతురాలి వయసు 60 నుంచి 65 ఏళ్లతో పాటు ఎరుపు రంగు చీర, పచ్చ రంగు జాకెట్ ధరించి ఉందన్నారు. వీఆర్వో అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
టిప్పర్ ఢీకొని
మహిళ దుర్మరణం
గౌరవరం(జగ్గయ్యపేట): టిప్పర్ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన గ్రామంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే ఉదారపు నాగమణి(42) కొంత కాలంగా జగ్గయ్యపేట పట్టణంలోని తొర్రకుంటపాలెంలో నివాసముంటోంది. ఈ క్రమంలో తన తల్లికి ఆరోగ్యం బాగలేకపోవటంతో శుక్రవారం గౌరవరం గ్రామానికి వచ్చి తిరిగి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉంది. నందిగామ నుంచి జగ్గయ్యపేట వైపు వెళ్తున్న టిప్పర్ ఆమెను వేగంగా ఢీకొనటంతో అక్కడికక్కడే మృతి చెందింది. గుర్తించిన స్థానికులు చిల్లకల్లు పోలీసులకు సమాచారం అందించగా ఎస్‌ఐ తోట సూర్య శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి వివాహమైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.