
ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం కావాలి
కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నంటౌన్: ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం కావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. నగరంలోని కలెక్టరేట్ సమీపంలోని బ్రహ్మపురం తదితర ప్రాంతాల్లో కలెక్టర్ శనివారం సైకిల్‌పై పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నగరంలో బాగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించిందన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కాలుష్యం నివారణకు నడుం బిగించాలన్నారు. ప్రతి చోట సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం అధికమైందని చెప్పారు.
సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను వినియోగించరాదు.
ఇకనైనా ప్రజలు రాబోయే కాలంలో మానవ మనుగడకు పర్యావరణానికి కలిగే ముప్పును గుర్తుంచుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి చేతి నూలు సంచిని తీసుకెళ్లే పాతకాలపు అలవాటును మరలా పాటించాలన్నారు. దీంతో ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుందని చెప్పారు. తద్వారా మురుగు కాలువల్లో నీరు కూడా సజావుగా ప్రవహిస్తుందన్నారు. ఇకపై ప్రజలు కూడా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను వినియోగించరాదని నిర్ణయం తీసుకోవాలన్నారు. నగరంలోని పారిశుద్ధ్య కార్మికులు మన చుట్టూ ఉన్న పరిసరాలను ఎంతో అంకితభావంతో పరిశుభ్రం చేస్తున్నారని, వారికి మనం ఎంతో రుణపడి ఉన్నామన్నారు. వారిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఎంఎంసీ కమిషనర్ సీహెచ్‌వీవీఎస్ బాపిరాజు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, కార్పొరేషన్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.