
ఇరిగేషన్ ఏఈ అదృశ్యంపై వీడని మిస్టరీ
తిరువూరు: తిరువూరు మైనర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కిషోర్ అదృశ్యమైన సంఘటనలో రెండో రోజు కూడా మిస్టరీ వీడలేదు. తిరువూరులో శుక్రవారం మధ్యాహ్నం మైనర్ ఇరిగేషన్ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన ఏఈ కిషోర్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ తొలుత ఖమ్మం జిల్లా వీఎం బంజరు వద్ద లభ్యమయ్యాయని ఆ శాఖ సిబ్బంది చెబుతుండగా, తర్వాత కొద్దిసేపటికి విశాఖపట్నంలో ఉన్నట్లు నిర్థారణ అయ్యిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఇంతవరకు ఏఈ ఆచూకీ లభించలేదని చెబుతున్నారు. తమ అల్లుడి ఆచూకీ తెలియలేదని, ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి వెళ్లిపోయారని ఏఈ మామ జామ ఆనందరావు తెలిపారు. ఆత్మహత్యకు తిరువూరు ఎమ్మెల్యేతో పాటు ఇరిగేషన్ అధికారుల వేధింపులే కారణమని శుక్రవారం రాత్రి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏఈకి రిలీవింగ్ ఉత్తర్వుల జారీ
తిరువూరు నుంచి గౌరవరానికి ఏఈ కిషోర్ బదిలీ అయినప్పటికీ నెల రోజులుగా రిలీవ్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్న ఇరిగేషన్ అధికారులు ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి అదృశ్యమవడంతో కంగుతిన్నారు. శనివారం ఉదయం ఇరిగేషన్ డీఈ ఉమాశంకర్ హుటాహుటిన ఏఈకి రిలీవింగ్ ఉత్తర్వులు జారీచేశారు.