
వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు
మోపిదేవి: మోపదేవిలోని శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. శనివారం ఉదయం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో అర్చకులు, ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ డీసీ దాసరి శ్రీరామ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకుడు బుద్దు పవన్‌కుమార్ శర్మ, వేదపండితులు కొమ్మూరి ఫణికుమార్ శర్మ బ్రహ్మత్వంలో ఉదయం 8 నుంచి 12 గంటల వరకు గోపూజ, సుప్రభాతసేవ, నిత్యార్చన, సుబ్రహ్మణ్య మూల మంత్ర అనుష్టానములు, హవనం, పవిత్ర జలప్రోక్షణ, పూర్ణాహుతి, వేదాశీర్వచనం, నీరాజన మంత్రపుష్పములచే సంప్రదాయ బద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆలయాల చరిత్ర పుస్తకావిష్కరణ
ఎంతో చరిత్ర గల పుణ్యక్షేత్రాల చరిత్రను భావితరాలకు అందించడానికి దివిసీమ వాసులు ఆధ్యాత్మిక గురువు తుర్లపాటి రామ మోహనరావు ప్రత్యేకంగా ఎస్టేట్ ఆలయాల చరిత్రను పుస్తక రూపంలో రచించినట్లు స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి క్షేత్రం, పెదకళ్లేపల్లి శ్రీ దుర్గానాగేశ్వర స్వామి క్షేత్రం, శ్రీకాకుళం శ్రీకాకులేశ్వరస్వామి క్షేత్రం, యార్లగడ్డ శ్రీ వేణుగోపాలస్వామి క్షేత్రాల చరిత్ర సంబంధించి పుస్తకాన్ని శనివారం ఆవిష్కరించారు. పుస్తక రచయితను ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ సూపరింటెండెంట్లు మదుసూదనరావు, సత్యనారాయణ, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.