
డిగ్రీ అడ్మిషన్లపై గందరగోళం
● ఇతర రాష్ట్రాల్లో పూర్తయిన అడ్మిషన్లు ● ఇప్పటికీ నోటిఫికేషన్ విడుదల చేయని ప్రభుత్వం ● నోటిఫికేషన్ ఆలస్యంతో డిగ్రీ కళాశాలల్లో మిగిలిపోతున్న సీట్లు ● ఆందోళనకు దిగనున్న విద్యార్థి సంఘాలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): డిగ్రీ అడ్మిషన్లపై కూటమి ప్రభుత్వం గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలై మూడు నెలలు దాటినా డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయకపోవటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా జూలై మాసానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమై తరగతులు సైతం ప్రారంభమవుతుంటాయి. కానీ ఇంతవరకు డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ ఊసే లేకుండా పోయింది. దీంతో వేలాది మంది విద్యార్థుల్లో ఆందోళనలతో పాటు గందరగోళం నెలకొంది. గడిచిన మూడు మాసాలుగా డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన అడ్మిషన్ల నోటిఫికేషన్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా 2024–25 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో సుమారు 35,484 మందికిగాను 31,736 మందికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరితోపాటు పలువురు సప్లిమెంటరీ రాసి పాసైన వారు ఉన్నారు. వీరంతా డిగ్రీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో 30 వేలకు పైగా సీట్లు
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కళాశాలలు కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయి. విశ్వవిద్యాలయం పరిధిలో సుమారుగా 140 వరకు వివిధ కళాశాలలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటుగా ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థలు డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. సుమారుగా 100 వరకూ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలలు బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీబీఏ వంటి కోర్సులను వివిధ కాంబినేషన్లతో డిగ్రీ విద్యను అందిస్తున్నాయి. వీటికి సంబంధించి ప్రస్తుత విద్యా సంవత్సరం 30 నుంచి 32 వేల సీట్లు మొదటి ఏడాది విద్యార్థులకు అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉన్నత విద్యపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా చేపట్టడంతో చాలా కళాశాలల్లో 40 నుంచి 50 శాతం సీట్లు మిగిలిపోయాయి. నగరాల్లో ఉన్న ప్రముఖ కళాశాలల్లోనూ కొన్ని కోర్సుల్లో సగం కూడా నిండని పరిస్థితులు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత అలస్యంగా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి.
మేజర్ సబ్జెక్టులపై సందిగ్ధం
తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి
ఇంటర్ ఫలితాలు విడుదలై మాసాలు గడుస్తున్నా ప్రవేశాలు చేపట్టకపోవటంపై గందరగోళం నెలకొంది. డిగ్రీ కళాశాలలు పునఃప్రారంభమై నెలన్నర దాటింది. ఇంకా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కాకపోవటం వలన విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. తక్షణమే డిగ్రీ అడ్మిషన్ల నోటిపికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలి.
– వానపల్లి రవీంద్ర,
వైఎస్సార్ సీపీ విద్యార్థి సంఘం నేత
డిగ్రీ కోర్సులకు సంబంధించి సింగిల్, డబుల్ మేజర్ సబ్జెక్ట్‌లపై సందిగ్ధం కొనసాగుతోంది. జాతీయ విద్యావిధానంలో భాగంగా ప్రభుత్వం నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే సింగిల్, డబుల్ మేజర్ సబ్జెక్ట్‌లతో నూతన డిగ్రీ కోర్సులను అందిస్తున్నారు. అయితే వీటిపై వస్తున్న సందిగ్ధంతో విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాలల యజమాన్యాలు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో వీటిపై మరింత లోతైన అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కృష్ణా విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, విద్యావేత్త ఆచార్య వెంకయ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయినా ప్రభుత్వం డిగ్రీ నోటిఫికేషన్‌పై గందరగోళ పరిస్థితులను కొనసాగిస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక వైపు ఇంటర్ ఫలితాలు వచ్చి మూడు మాసాలైంది. అలాగే ఇతర రాష్ట్రాల్లో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. అయినా ఏపీలో డిగ్రీ ప్రవేశాలు చేపట్టకపోవటంపై విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి. ఇప్పటికే ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు ఇటీవల ఆందోళనను నిర్వహించాయి. అలాగే నాలుగైదు రోజుల్లో డిగ్రీ విద్యాసంస్థల సమ్మె చేయాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించినట్లు సమాచారం.

డిగ్రీ అడ్మిషన్లపై గందరగోళం