
గంజాయి ముఠా గుట్టురట్టు
గుడ్లవల్లేరు: గుడ్లవల్లేరు పోలీసులు ఓ గంజాయి ముఠా గుట్టును రట్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి నిందితులను అరెస్ట్ చేశారు. గుడ్లవల్లేరు ఎస్‌ఐ ఎన్.వి.వి.సత్యనారాయణ కథనం మేరకు గుడ్లవల్లేరుకు చెందిన యువకులు గంజాయికు బానిసలయ్యారు. వారి జల్సా ఖర్చులకు కావలసిన సొమ్మును సంపాదించేందుకు గంజాయి కోసం పొరుగు రాష్ట్రానికి చెందిన వారితో పరిచయాలు పెంచుకున్నారు. అక్కడ గంజాయి తక్కువ ధరకు తీసుకువచ్చి గుడ్లవల్లేరులోని చుట్టుపక్కల యువకులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనిపై గుడ్లవల్లేరు ఎస్‌ఐ సత్యనారాయణకు పక్కా సమాచారం రావడంతో వారిపై నిఘా పెంచారు. గత నెల 28న వారిపై దాడి చేశారు. రెవెన్యూ సిబ్బంది సహకారంతో వారిపై గంజాయి కేసు నమోదు చేశారు. గుడ్లవల్లేరు గ్రామానికి చెందిన బంకూరి కొండలరావు, మెరుగు జాన్‌బాబు అలియాస్ జాన్‌రావు, మత్తే ప్రకాష్, బొడ్డు సురేంద్ర, బడుగు భవాని శంకర్, కోటే భార్గవ్‌ను అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. 15 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నెల్లూరు జైలుకు పంపించారు. ఈ ఆరుగురితో పాటు గంజాయి సరఫరా చేసే సంతోష్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన సాంతోను ముండా అనే యువకుడిని, పలు గంజాయి కేసుల్లో ఉన్న కొండా రాకేష్‌ను గుడ్లవల్లేరు ఎస్‌ఐ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. వారికి కోర్టు 15 రోజుల రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకి పంపామని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.