ఆసిఫాబాద్: సైబర్ మోసాలు జిల్లా ప్రజలను కలవరపెడుతున్నాయి. తక్కువ కాలంలోనే కేటుగాళ్లు జిల్లా ప్రజల నుంచి రూ.కోట్లలో కాజేశారు. ఈ క్రమంలో అప్రమత్తమైన జిల్లా పోలీస్‌శాఖ సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో అక్టోబర్‌ను సైబర్ అవగాహన మాసంగా ప్రకటించి ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. పోలీస్‌శాఖ వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారం 2025 జనవరి 1నుంచి 2026 అక్టోబర్ 3వరకు జిల్లాలో 706 సైబర్ ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 83 కేసులకు సంబంధించి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ 21నెలల కాలంలో జిల్లా ప్రజలు సైబర్ మోసాల్లో రూ.5,26,27,246 నష్టపోయారు. అయితే, పోలీసులు సత్వరం స్పందించి బాధితులకు రూ.19,29,064 తిరిగి ఇప్పించగలిగారు. ఈ కేసుల్లో 15 మంది నిందితులను అరెస్ట్ చేశారు. గతంలోనే జిల్లాలో 1,573 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
నెలపాటు ప్రత్యేక కార్యక్రమాలు
డీజీపీ, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 1నుంచి 31వ తేదీ వరకు ‘ఆగండి.. ఆలోచించండి.. ధ్రువీకరించి అడుగు వేయండి’ అనే థీమ్‌తో అవగాహన మాసం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోనూ ఎస్పీ నితిక పంత్ ఆదేశాలతో నెలపాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తొలిరోజు ఈ నెల 1న జిల్లా కేంద్రంలో డీఎస్పీ అశోక్, సీఐ రవి, పోలీసులు, పాఠశాల విద్యార్థులతో భారీ ఫ్లాష్ మార్చ్ నిర్వహించారు. మొబైల్ ఫ్లాష్ లైట్ల వెలుగుల ద్వారా ‘సైబర్ మోసాలపై అప్రమత్తతతో వెలుగులు నింపుదాం’ అనే నినాదాలు చేశారు. యువత, ప్రజలతో కలిసి సైబర్ మోసాల నివారణపై సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి బస్టాండ్ వరకు కొనసాగిన ర్యాలీలో ‘సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి’ ఓటీపీ ఎవరికీ చెప్పకండి’ అంటూ నినదించారు. ఈ నెలంతా ప్రతీ మండల కేంద్రంలో, పాఠశాలలు, కళాశాలలు, గిరిజన గూడేలు, మార్కెట్లలో వీధి నాటకాలు ప్రదర్శించనున్నారు. పోస్టర్లు, ఎగ్జిబిషన్ల ద్వారా అవగాహన కల్పించనున్నారు. క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 31న జిల్లా వ్యాప్తంగా భారీ ఫ్లాష్ వాక్ నిర్వహిస్తారు.


