కౌటాల: ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంకట్ తెలిపారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంలో ఎంపికై న మండలంలోని ముత్తంపేట రైతులకు మంగళవారం కౌటాల రైతువేదికలో అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం, అజ్ఞాస్త్రం, దశపర్ణి కషాయం వినియోగంతో పంటలకు సరైన పోషకాలు అందుతాయన్నారు. రైతులందరూ రసాయన ఎరువుల వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని, సూచించారు. వర్షాలు కురిసిన నేపథ్యంలో పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు ఘన్‌శ్యామ్, సాగర్, రాజేశ్వర్, రేష్మిత, కల్పన పాల్గొన్నారు.


