● జిల్లాలో పెట్రేగిపోతున్న కామాంధులు ● కఠిన శిక్షలున్నా మార్పు కరువు ● వరుస ఘటనలతో ఆందోళన
కౌటాల: ఏఐ యుగంలోనూ మహిళలు, చిన్నారుల భద్రత ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. పాఠశాలల నుంచి పని ప్రదేశాలు, పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు అతివలపై అఘాయిత్యాలు సాగుతూనే ఉన్నాయి. చట్టాలు, శిక్షలు అమలు అవుతున్నా కామాంధుల్లో భయం కరువైంది. ఓ వైపు గంజాయి.. మరోవైపు సినిమాలు, సోషల్ మీడియా, అశ్లీల వెబ్‌సైట్ల ప్రభావంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. జిల్లాలో చిన్నారులపైనా పైశాచికత్వానికి తెగబడుతున్న వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిలో కొన్ని వెంటనే వెలుగులోకి వస్తుండగా.. మరికొన్ని ఇతర కేసుల విచారణ సమయంలోనో.. బాధితులు అనారోగ్యానికి గురైనప్పుడో వెలుగు చూస్తున్నాయి. పరువు పోతుందన్న భయంతో కొందరు తల్లిదండ్రులు విషయం దాచిపెడుతున్నారు. నిందితులు తెలిసినవారై ఉండటం, పోలీసుల దృష్టికి తీసుకెళ్తే వేధింపులు ఇంకా పెరుగుతాయనే అభద్రత భావంతో చాలామంది ఫిర్యాదు కూడా వెనుకాడుతున్నారు.
ప్రశ్నార్థకంగా భద్రత
జిల్లాలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 2024లో 24 లైంగిక దాడులు, 27 పోక్సో కేసులు నమోదు కాగా, గతేడాది లైంగిక దాడులు 22, పోక్సో కేసులు 18 నమోదయ్యాయి. ఈ ఏడాది జిల్లాలో పలు కేసులు వెలుగులోకి వచ్చినా అధికారికంగా వివరాలు వెల్లడించేందుకు పోలీసులు వెనుకాడుతున్నారు. ఇటీవల కాగజ్‌నగర్ పట్టణంలో సొంత మేనమామ అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన జిల్లావ్యాప్తంగా సంచల నం సృష్టించిన విషయం తెలిసిందే. బాలిక ఆనా రోగ్యానికి గురై వైద్యుల వద్దకు వెళ్లేవరకు విషయం వెలుగులోకి రాలేదు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో సిర్పూర్ నియోజకవర్గంలోని ఓ మండలంలో ఖాళీగా జులాయిగా తిరిగే 16 ఏళ్ల బాలుడు ఆరేళ్లు, తొమ్మిదేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారుల లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఇలా చాలా నేరాల్లో బాలికలకు తెలిసినవారే అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు నిత్యం పిల్లలను గమనిస్తుండాలని నిపుణులు సూచిస్తున్నారు. విచారణ వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
కఠిన శిక్షలు తప్పవు
18 ఏళ్లలోపు పిల్లలపై లైంగిక దాడులు, వేధింపులపై ప్రత్యేక దృష్టి సారించాం. బాధితులకు అండగా నిలుస్తూ పోక్సో కేసులు నమోదు చేస్తున్నాం. బాలికలపై వేధింపులకు కనీసం మూడేళ్లకు తగ్గని జైలు శిక్ష, అత్యధికంగా జీవిత ఖైదు విధిస్తారు. సీఐడీ నుంచి మానిటర్ చేయడంతోపాటు ప్రత్యేక కోర్టుల ద్వారా కేవలం 60 రోజుల్లో కఠిన శిక్షలు పడేలా చూస్తాం. మహిళల రక్షణ చట్టాలపై కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. మహిళలు, యువతులు, బాలికలు ఎవరైనా వేధించినా, ఇబ్బందులకు గురిచేసినా వెంటనే షీ టీమ్, డయల్ 112కు సమాచారం అందించాలి. – వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్‌నగర్


