ఆసిఫాబాద్/కెరమెరి: రాష్ట్ర ప్రభుత్వం ఓట్ల కోసం కొన్నివర్గాలకు కొమ్ముకాయకుండా అధికారికంగా తెలంగాణ విమోచన దినం నిర్వహించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు డిమాండ్ చేశారు. సేవా సంకల్ అభియాన్‌లో భాగంగా జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, ప్రధాన కార్యదర్శులు అరిగెల మల్లికార్జున్, కొట్నాక విజయ్‌కుమార్, రాష్ట్ర స్పోక్స్ పర్సన్ మహేశ్‌తో కలిసి మాట్లాడారు. విమోచన దినం సందర్భంగా ఈ నెల 17న దీపాలంకరణతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలిపారు. అక్టోబర్ 7 వరకు పాఠశాలల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పీవీ నరసింహారావు వంటి కాంగ్రెస్ నాయకులు రజాకార్ల అకృత్యాలపై పోరాడారని, కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విమోచన దినం నిర్వహించేందుకు భయపడుతుందన్నారు. రజాకార్లు మైనారీర్టలను సైతం ఇబ్బందులకు గురిచేశారని, అప్పటి జర్నలిస్టు షోయబుల్లా ఖాన్‌ను హతమార్చినట్లు గుర్తు చేశారు. కేసీఆర్ జాతీయ సమైక్యతా దినోత్సవం, కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవం పేరుతో నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే అధికారికంగా వేడుకలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ ప్రధాని మోడీ 25 ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు కెరమెరి మండలం జోడేఘాల్‌కు వెళ్లి కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భీం సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు కోవ విజయ్, సెడ్మకి తుకారాం, ఖండ్రె విశాల్, ఆకుల సంతోష్, రవీందర్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.


