● కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్: గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో నిర్వహించే గ్రామ, వార్డు సభల్లో కీలక అంశాలపై చర్చించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పైప్‌లైన్ లీకేజీలు ఉంటే మరమ్మతులు చేయాలని, క్లోరినేషన్ ప్రక్రియ నిరంతరం జరిగేలా చూడాలని ఆదేశించారు. డ్రెయినేజీలు, వీధులు నిత్యం శుభ్రం చేయాలన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి దోమల నివారణకు ఫాగింగ్, స్ప్రేయింగ్ చర్యలు చేపట్టాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని, వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియలో బూత్‌లెవల్ అధికారులు ఓటరు నమోదు, సవరణల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్ ఆదా, సమస్యల పరిష్కారాలపై ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రోత్సాహంతోపాటు నగదు బహుమతి అందిస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.


