కార్పొరేట్‌లో ఇంటర్‌ | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌లో ఇంటర్‌

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

● ప్రభుత్వ విద్యార్థులకు సదావకాశం ● మెరిట్‌ ఆధారంగా ఎంపిక ● 5 వరకు దరఖాస్తులకు గడువు

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రతిభావంతులైన పేద విద్యార్థుల ఇంటర్మీడియట్‌ కలలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను కార్పొరేట్‌ కళాశాలల్లో ఉచితంగా చదివించేందుకు కార్పొరేట్‌ విద్యాపథ కం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ట్యూషన్‌ ఫీజు, పాకెట్‌ మనీ అందిస్తూ విద్యార్థుల చదువుకు పూర్తి ఆర్థిక భరోసా కల్పిస్తోంది. 2026– 27 విద్యా సంవత్సరానికి ఉత్తమ మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

ప్రభుత్వ విద్యార్థులు అర్హులు

జిల్లాలో పదో తరగతి విద్యార్థులు మొత్తం 6,932 మంది వార్షిక పరీక్షలు రాయగా, ఇందులో 6,527 మంది ఉత్తీర్ణత సాధించారు. కార్పొరేట్‌ కళాశాలల్లో ఇంటర్‌ విద్యను అభ్యసించేందుకు జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్‌, కేజీబీవీలు, నవోద య, మోడల్‌ స్కూళ్లు, గురుకులాలు, బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో చదివిన వారు అర్హులు. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదా యం రూ.2 లక్షలు, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలకు మించొద్దు. దరఖాస్తుకు మీసేవ కేంద్రాల నుంచి పొందిన కుల, ఆదాయ ధ్రువపత్రాలు, 4 నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, పదో తరగతి మెమో, ఆధార్‌, బ్యాంక్‌ పాస్‌బుక్‌, దివ్యాంగులైతే సంబంధిత ధ్రువపత్రాలు జతపరచాలి. పదో తరగతిలో 400కు పైగా మార్కులు సాధించిన వారిని అధికారులు ఎంపిక చేస్తారు.

ఈ నెల 5 వరకు గడువు

జిల్లాలో స్థానికంగా మెరుగైన విద్యా అవకాశాలు లేవు. ఎక్కువ మంది సమీపంలోని మంచిర్యాలతోపాటు కరీంనగర్‌, హైదరాబాద్‌ వంటి నగరా లకు వెళ్తుంటారు. పేద విద్యార్థులు కొంతమంది ఆర్థిక స్థోమత లేక మధ్యలోనే చదువుకు దూరమవుతున్నారు. కార్పొరేట్‌ విద్యా పథకం కింద ఎంపికై న ఒక్కో విద్యార్థికి ట్యూషన్‌ ఫీజు కింద ప్రభుత్వం రూ.35 వేలు, పాకెట్‌ మనీగా రూ.3 వేలు చెల్లించనుంది. మీసేవ కేంద్రాల ద్వారా https://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్‌ 5వ తేదీ వరకు గడువు ఉంది. జిల్లాలోని అర్హులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

కార్పొరేట్‌ కళాశాలల్లో చదివేందుకు పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యాపథకం ద్వారా అందించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకోసం జూన్‌ 5లోగా అర్హులైన విద్యార్థులు త్వరగా దరఖాస్తులు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏ కార్పొరేట్‌ కళాశాలనైనా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి.

– అశోక్‌ మదిరె,

జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి

Advertisement
 
Advertisement
Advertisement