కెరమెరి: గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలు, ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో ప్రవేశాల కోసం బుధవారం నుంచి బడిబాట కార్యక్రమం మొదలైంది. తొలిరోజు హాస్టళ్లలో పాడైన వస్తువులు తొలగించి ఆవరణ, తాగునీటి ప్రాంతం, ఓహెచ్‌ఆర్ ట్యాంకులు శుభ్రపరిచారు. గ్రామ సభలు నిర్వహించి బడిబాట ఆవశ్యకతను వివరించారు. జిల్లాలో గిరిజన ప్రాథమిక పాఠశాలలు 332 ఉండగా ఆశ్రమ ఉన్నత పాఠశాలలు 46 ఉన్నాయి. ఇందులో 13,126 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఐటీడీఏ పీవో మంద మకరందు ప్రత్యేక షెడ్యూల్ రూపొందించారు. గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే కార్యక్రమాలు ఉండగా, ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆశ్రమాల షెడ్యూల్..
ఈ నెల 4న వంటశాలలు, డార్మెటరీలు, 5న తరగతి గదులు, కార్యాలయ గదులు, 6న సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు శుభ్రం చేస్తారు. 8 నుంచి 10 వరకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల స్వీకరణ, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేస్తారు. 11, 12 తేదీల్లో సిబ్బందితో సమావేశం, రికార్డుల నవీకరణ, విధుల కేటాయింపు, 17న సమగ్ర విద్య, బాలిక విద్యా దినోత్సవం, 18న డిజిటల్ తరగతి గదులపై అవగాహణ, 19న క్రీడాదినోత్సవం నిర్వహిస్తారు.
ప్రతిరోజూ సమీక్షించాలి
గతేడాది ఉన్న విద్యార్థులను వందశాతం నిలుపుదల చేయడంతోపాటు కొత్త వారిని బడిలో చేర్పించాలి. షెడ్యూల్ ప్రకారం ఉపాధ్యాయులు కార్యక్రమాలు నిర్వహించాలి. ఎవ్వరికీ మినహాయింపు లేదు. ఎస్సీఆర్‌పీలు ప్రతిరోజూ కార్యక్రమాలను సమీక్షించాలి.
– పి.రమాదేవి, గిరిజనశాఖ సంక్షేమ అధికారి


