నిరాశపర్చిన ముఖ్యమంత్రి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నిరాశపర్చిన ముఖ్యమంత్రి పర్యటన

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు

రెబ్బెన: జిల్లాకు వస్తే న్యాయం జరుగుతుంది.. అభివృద్దికి నిధులు మంజూరవుతాయని ఎదురుచూసిన జిల్లా ప్రజలను ముఖ్యమంత్రి పర్యటన నిరాశపర్చిందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. గోలేటిలోని ఆఫీసర్స్‌ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం సరికాదన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి సభకు అధ్యక్షతన వహించాల్సి ఉన్నా.. కనీసం మాట్లాడే అవకాశం కల్పించకుండా పక్కన పెట్టి అవమానపర్చడం సంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రెండు నియాజకవర్గాలకు ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదన్నారు. ఆసిఫాబాద్‌– ఆదిలాబాద్‌ రోడ్డు అధ్వానంగా మారిందని, అలాగే కాగజ్‌నగర్‌– సిర్పూర్‌, సిర్పూర్‌ –బెజ్జూర్‌, కాగజ్‌నగర్‌ –పెంచికల్‌పేట్‌ రోడ్లు దారుణంగా ఉన్నా నిధులు కేటాయించలేదన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని చెబుతున్నారని, ముందుగా డీపీఆర్‌ను సిద్ధం చేయాలని హితవు పలికారు. వరిధాన్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement