సిర్పూర్(టి) మండలం కోనేరు కాలనీ సమీపంలో ఈ నెల 14న రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కౌటాల నుంచి సిర్పూర్(టి) వైపు వెళ్తున్న డొంగ్రి రక్షిత్, సిర్పూర్(టి) నుంచి కౌటాల వైపు వెళ్తున్న ఆడే రవి వాహనాలు ఎదురుగా ఢీకొనడంతో నుజ్జునుజ్జు అయ్యాయి.
కౌటాల: కుర్రకారు రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. బైక్‌లను ఎలా నడిపినా తమను అడిగేవారు లేరనే ధీమా వారిలో పెరిగిపోతోంది. బైక్‌పై ముగ్గురేసి యువకులు ఎక్కి హైస్పీడ్‌తో వెళ్తూ, సడన్‌గా బ్రేక్‌లు వేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. మైనర్లు బైకులపై గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్తూ సిగరెట్లు, మత్తు పదార్థాలు సేవిస్తున్నారు. 16 ఏళ్లు కూడా నిండని వారు మత్తులో ప్రమాదాల బారిన పడటమే కాకుండా, ఎదుటివారికీ నష్టం కలిగిస్తున్నారు. సాయంత్రం పోలీసుల నిఘా ఉంటున్నా మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో వీరు మరింత రెచ్చిపోతున్నారు. జిల్లాలో గతేడాది 267 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా, 60 మంది మృతి చెందారు, 74 మంది గాయపడ్డారు.
మైనర్ల చేతికి బైక్‌లు..
‘వేగం కన్నా ప్రాణం మిన్నా’ అనే నినాదం ఉన్న సూచిక బోర్డులు రోడ్ల పక్కన తరచూ కనిపిస్తూనే ఉంటాయి. అయితే పలువురు వాటిని పట్టించుకోకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వస్తున్నారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాలతోపాటు కౌటాల, రెబ్బెన, వాంకిడి, సిర్పూర్(టి), దహెగాం, చింతలమానెపల్లి మండల కేంద్రాల్లో యువత వేగంగా బైక్‌లు నడుపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇంటర్, పదో తరగతి చదివే మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు బైక్‌లు ఇచ్చి స్కూళ్లకు పంపిస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులు కూడా బైక్‌పై ముగ్గురు, నలుగురిని ఎక్కించుకుని పరీక్షలకు హాజరవుతున్నారు. హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.
నిఘా కరువు..
రోడ్లపై కొందరు యువకులు బైక్‌లను ర్యాష్‌గా నడుపుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో న్యూసెన్స్‌కు పాల్పడేవారిపై ఈ–పెట్టీ కేసులు నమోదు చేస్తున్నట్లే, వీరిపై కూడా కేసులు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారనే విషయంలో తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాల్సి ఉంటుంది. ఇంటి పనుల కోసం మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
చట్టపరమైన చర్యలు తప్పవు
ట్రిపుల్, ర్యాష్, మైనర్ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరం. వాహనదారుల్లో చాలా మంది బాధ్యతారా హిత్యంగా వ్యవహరిస్తున్నా రు. వాహనం నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తాం. యువత ర్యాష్ డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపడతాం. 18 ఏళ్లు నిండిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వాహనాలు నడపాలి. రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించి, అతివేగంగా వెళ్లే ద్విచక్ర వాహనదారులపై చర్యలు తీసుకుంటాం. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
– నితిక పంత్, ఎస్పీ
సెల్ ‘కిల్’ డ్రైవింగ్..!
భుజం, తల మధ్యలో సెల్‌ఫోన్ పెట్టుకుని వాహనం నడపడం.. బ్లూటూత్‌లో మాట్లాడుతూ వెనుక నుంచి హారన్ కొట్టినా పట్టించుకోకుండా అడ్డదిడ్డంగా వెళ్లడం వాహనదారులకు అలవాటైపోయింది. సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు రూ.1,000, హెల్మెట్ వాడనందు కు రూ.135 జరిమానా విధిస్తారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని పోలీసులు మొత్తుకుంటున్నా, జరిమానాలు విధిస్తున్నా మార్పు రావడం లేదు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా సెల్‌ఫోన్ డ్రైవింగ్ నిలుస్తుంది. ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడపడాన్ని పోలీస్ అధికారులు ‘డేంజర్ డ్రైవింగ్’గా పరిగణిస్తున్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతో మెడనొప్పితో పాటు వెన్నెముక నొప్పి కూడా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అత్యవసరం అయితే వాహనాన్ని పక్కకు ఆపి, మాట్లాడిన తర్వాతే వెళ్లాలని సూచిస్తున్నారు.


