ఆసిఫాబాద్‌అర్బన్: జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం చార్ట్ అధికారులు, అదనపు చార్ట్ అధికారులకు మూడురోజుల శిక్షణను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనగణన, ఇళ్ల గణనలో భాగంగా 2026లో మొదటి విడతలో ఇళ్లు లెక్కించి డిజిటలైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి జాబితా రూపొందిస్తారని పేర్కొన్నారు. సెన్సెస్ ఇండెక్స్ పుస్తకాన్ని పూర్తిగా చదివి అవగాహన పెంపొందించుకోవాలని, సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, జిల్లా గణాంక అధికారి గురువయ్య, జిల్లా సెన్సెస్ అధికారులు వినయ్, గంగయ్య, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.
వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడొద్దు
గృహావసరాలకు కేటాయించిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వ్యాపార, వాణిజ్య అవసరాలకు వాడొద్దని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఆదివారం అదనపు కలెక్టర్ డేవిడ్, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి వసంతలక్ష్మి, కాగజ్‌నగర్ డీఎస్పీ వహిదుద్దీన్‌లతో కలిసి జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా రెవెన్యూ, పౌరసరఫరాలు, మున్సిపల్ అధికారులు జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో కొరత లేదని తెలిపారు. ఎల్‌పీజీ గోదాములు, పెట్రోల్ బంకుల వద్ద స్టాకు వివరాలను ప్రదర్శించాలని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోజుకు 2వేల చొప్పున బుకింగ్ చేసుకొన్న వారికి సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు. విద్యాసంస్థలు, వసతి గృహాలు, గురుకులాల అవసరాలకు సరిపడా సిలిండర్లు అందించాలన్నారు. బంకులలో పెట్రోల్‌ను ప్లాస్టిక్ క్యాన్‌లలో పోయొద్దన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల సిలిండర్ల బుకింగ్ గడువు ఉందని పేర్కొన్నారు.


