ప్రమాదకర గడ్డిమందు విచ్చలవిడిగా వాడకుండా ప్రభుత్వం చర్యలు వ్యవసాయాధికారుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే రైతులకు విక్రయాలు మహారాష్ట్ర నుంచి జిల్లాకు అక్రమ రవాణాకు ఆస్కారం అన్నదాతలకు అవగాహన కల్పించడమే ప్రధానం
చింతలమానెపల్లి: పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు వినియోగాన్ని నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇకపై గడ్డి మందు వినియోగానికి వ్యవసాయశాఖ అధికారుల అనుమతి(ప్రిస్క్రిప్షన్) తప్పనిసరిగా మారనుంది. జిల్లాలో అధికశాతం ప్రజలు వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు. 4.50 లక్షలకు పైగా ఎకరాల్లో వ్యవసాయ భూమి ఉండగా, ప్రధానంగా పత్తి, వరి, కంది, పెసరతోపాటు కూరగాయలు, శనగ, మొక్కజొన్న, జొన్న పంటలు పండిస్తున్నారు. వరి, పత్తి పంటలకు కలుపు బెడద ఎక్కువగా ఉండటంతో రైతులు గడ్డిమందులను ఆశ్రయిస్తున్నారు. వర్షాలు అనుకూలించని పక్షంలో కలుపు తీయడం రైతులకు శక్తికి మించిన పనిగా మారుతోంది. కూలీలను వినియోగించినా ఖర్చు భారం పడుతోంది. దీంతో రైతులు కలుపు నివారణ మందుల వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. పత్తి సాగులో బీటీ– 3 విత్తనాలపై ప్రభుత్వం నిషేధం విధించినా అక్రమంగా కొనుగోలు చేసి సాగుచేస్తున్నారు. అలాగే గ్లైఫోసెట్ రౌండప్ మందును సైతం అక్రమంగా కొనుగోలు చేసి పత్తిలో కలుపు నివారణకు వాడుతున్నారు. జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు, గ్లైఫోసెట్ తరలిస్తున్న అనేక మందిపై ఏటా కేసులు నమోదవుతున్నాయి. పారా క్వాట్ మొక్కల్లోని ఫోటోసింథసిస్ కణాలను నాశనం చేస్తూ కలుపు నివారణిగా పనిచేస్తుంది. గ్లైఫోసెట్ మొక్కలను మొత్తం నాశనం చేస్తుంది.
జిల్లాలో అమలయ్యేనా..?
మన రాష్ట్రంలో పూర్తిస్థాయిలో గ్లైఫోసెట్ గడ్డిమందుపై నిషేధం ఉంది. కానీ మహారాష్ట్రలో విక్రయాలకు అనుమతి ఉంది. తాజాగా పారాక్వాట్ మందుపై నియంత్రణ విధించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు వ్యవసాయ అధికారి లేదా సంబంధిత అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం సదరు అధికారి వ్యవసాయ భూమిని పరిశీలించి అనుమతి ఇస్తారు. మందు వినియోగం తప్పనిసరి అని ధ్రువీకరించి సిఫార్సు చేస్తే డీలర్ వద్ద నుంచి కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ జిల్లాకు పొరుగున ఉన్న మహారాష్ట్రలో గ్లైఫోసెట్, గడ్డి మందు విక్రయాలపై నియంత్రణ లేదు. ఈ నేపథ్యంలో రైతులు అక్కడి నుంచి కొనుగోలు చేసి అక్రమంగా తరలించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అక్రమంగా వ్యాపారాలు చేసే వారికి ఇది ఆదాయ మార్గంగా మారనుంది. రైతులకు సరైన అవగాహన కల్పించి చైతన్యం కలిగిస్తేనే ఫలితాలు సాధించవచ్చు.
రైతులకు అవగాహన కల్పిస్తాం
పారాక్వాట్ గడ్డిమందు వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై రైతులకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తాం. ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతాం. పారాక్వాట్ గడ్డి మందు నియంత్రణపై కొత్త ఉత్తర్వులు ఇంకా రాలేదు. ఈ మందుతో కలిగే ప్రభావాలపై వ్యవసాయ శాఖలో చర్చలు కొనసాగుతున్నాయి. రైతులు ఈ మందును వినియోగించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.
– వెంకటి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
ప్రాణాలకే ప్రమాదం
పారాక్వాట్ గడ్డి మందు వినియోగంపై ప్రారంభంలో అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. కానీ అనంతర కాలంలో ఆ గడ్డిమందు అనర్థాలను నిపుణులు గుర్తించారు. పారాక్వాట్ వినియోగంతో పర్యావరణపరంగా నష్టంతోపాటు వర్షాలు పడిన అనంతరం కూడా దీని ప్రభావం భూమి, మొక్కల్లో తగ్గడంలేదు. వీటిని పిచికారీ చేసే రైతులు, కూలీలు సైతం దుష్ప్రభావాలకు లోనవుతున్నారు. క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడేవారు పారాక్వాట్ సేవిస్తే చికిత్స కూడా అందించలేని పరిస్థితి. ప్రధాన అవయవాలు దెబ్బతిని మరణం తప్పనిసరిగా మారింది. మనుషుల్లో దుష్ప్రభావాలకు యాంటీడోస్ లేకపోవడంతో అత్యంత ప్రమాదకరంగా మారింది. దీంతో రెండేళ్లుగా ప్రాణాంతక మందు నిషేధం కోసం వైద్యులు పోరాటం చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన ఘటనల్లో చికిత్సకు లొంగని వైనంపై ప్రభుత్వాలకు నివేదికలు అందించారు. సిర్పూర్(టి) ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అసెంబ్లీలో పారాక్వాట్ విషయాన్ని లేవనెత్తారు. గడ్డిమందుకు వ్యతిరేకంగా వైద్యులతో సంఘాన్ని రూపొందించి పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులతో వీరి పోరాటానికి ఫలితం దక్కినట్లయింది.


